కుప్పంలో చంద్రబాబు గెలిస్తే, కొడాలి నాని రాజకీయ సన్యాసమే.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుస్తారా.? అసలు కుప్పం నుంచి పోటీ చేస్తారా.? లేదంటే, ఇంకేదన్నా కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా.? ఏమోగానీ, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు.. వాటి ఫలితాల్ని చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా దారుణమైన దెబ్బ తినేసినట్లే అర్థమవుతోంది.

సొంత జిల్లా చిత్తూరు సంగతి తర్వాత.. సొంత నియోజకవర్గంలోనూ చంద్రబాబుకి ఎదురుగాలి వీస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ కుప్పం నుంచి పోటీ చేయడం దాదాపుగా అసాధ్యమన్న చర్చ సర్వత్రా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఒకవేళ చంద్రబాబు గనుక కుప్పం నుంచి పోటీ చేసి గెలిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు సమాధి కట్టేశారన్నది కొడాలి నాని వాదన.

రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య దూషణలు జరుగుతున్న వేళ, కొడాలి నాని కాస్త ఆలస్యంగా మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు మీద షరామామూలుగానే విరుచుకుపడ్డారు. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, కుప్పంలో చంద్రబాబు గెలుపుపై కొడాలి నాని సవాల్ విసరడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. కొడాలి నాని స్వయంగా కుప్పంలో పోటీ చేసి చంద్రబాబుని ఓడించొచ్చు కదా.? అన్న ప్రశ్న కొడాలి నాని మీదకు టీడీపీ నుంచి దూసుకెళుతోంది. మరి, కొడాలి ఈ ప్రశ్నకు ఎలా బదులిస్తారో ఏమో.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వైసీపీ, కింది స్థాయిలో మారుతున్న సమీకరణాల్ని గుర్తించే పరిస్థితుల్లో లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సొంత పార్టీలోనే కుమ్ములాటలు కనిపిస్తున్నా, వాటిని అధినాయకత్వం అదుపు చేయలేకపోతోంది. ఇవన్నీ ముందు ముందు వైసీపీకి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అలాగని టీడీపీ బలం పుంజుకోలేదు. పుంజుకునే అవకాశం కూడా కనిపించడంలేదు.