దెందులూరు ఎన్నికల చిత్రం… 93 కేసులున్న చింతమనేనికి మరో షాక్ ఇస్తారా?

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో ఏపీలో అసలు సిసలు సందడి మొదలైంది. ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులకు చంద్రబాబు చివరి నిమిషంలో అన్నట్లుగా టిక్కెట్లు కన్ ఫాం చేసి, బీ-ఫారాలు ఇచ్చారు. ఈ సమయంలో ఈసారి టిక్కెట్ డౌటే అనే కామెంట్లు వచ్చిన నేపథ్యంలో… అనూహ్యంగా చింతమనేని ప్రభాకర్ కి దెందులూరు టిక్కెట్ దక్కింది. దీంతో… మరోసారి అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్ పోరుకు తెరలేచింది.

దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని 2019 ఎన్నికల్లో యువకుడు అబ్బయ్య చౌదరి ఓడించారు. ఆ ఎన్నికల్లో చింతమనేనిపై 16,131 ఓట్ల మెజారిటీతో గెలిచి షాకిచ్చారు. దీంతో.. ఇక దెందులూరులో చింతమనేనికి షాకులు తప్పవనే చర్చ తెరపైకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ డౌట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే… అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్నారు ప్రభాకర్!

వాస్తవానికి దెందులూరులో అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసిల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. నాయకత్వం మాత్రం ఆ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటోంది. దీంతో… ఏ పార్టీ అయినా ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టిక్కెట్లు ఇస్తుంటుంది. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే అసెంబ్లీలో అడుగుపెట్టడం అందుకు సరైన ఉదాహరణ.

తొలుత కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ దెందులూరు నియోజకవర్గం.. ఆ తర్వాత టీడీపీ నేత చింతమనేని అడ్డాగా మారింది. ఇక గత ఎన్నికల్లో చింతమనేనిని మట్టికరిపించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో బలమైన పునాదులు వేసుకున్నారు. ఈ సమయంలో మరోసారి ఊర మాస్ లీడర్ చింతమనేని – క్లాస్ లీడర్ అబ్బయ్య చౌదరి మధ్య జరగబోయే వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో మాస్‌ లీడర్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన ఈ క్లాస్‌ లీడర్‌.. ఈ ఎన్నికల్లోనూ అదే స్పీడ్‌ తో దూసుకుపోతున్నారని అంటున్నారు.

కొల్లేరు పరివాహక ప్రాంతంతోపాటు దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 20 వేల 274 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గత ఎన్నికల్లో చింతమనేనికి షాకిచ్చిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై క్లీన్‌ ఇమేజ్‌ ఉండటం, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయించడంతో దెందులూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

పైగా.. చింతమనే ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడం అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్‌ గా మారుతుందని అంటున్నారు. తాజాగా ప్రకటించిన తన అఫిడవిట్ లో చింతనేని తనపై 93 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉన్నట్లు ప్రకటించారంటే… పరిస్థితి అర్ధం చేసుకొవచ్చు!! ఇదే క్రమంలో… ఆయన మాటతీరు, స్వభావం ఏ మాత్రం మారకపోవడంతో చాలా మంది కేడర్‌.. ప్రచారానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇవన్నీ అబ్బయ్య చౌదరికి కలిసొచ్చే విషయాలుగా చెబుతున్నారు.

అయినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకున్న చింతమనేని విజయం పక్కా అంటున్నారు. అయితే… పార్టీలోని నేతలతో పాటు జనసేన, బీజేపీలోని కొంతమంది నేతలు చింతమనేనికి సహకరిస్తారా? లేదా? అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే చాన్స్‌ ఉన్నప్పటికీ… ఆ అవకాశం లేదని అంటున్న్నారు! మరి క్లాస్ వర్సెస్ మాస్ వార్ లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి!