నిజంగానే తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చేస్తోందా.? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోన్న అధికారిక లెక్కల ప్రకారం అయితే, రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నట్లే భావించాలి. కానీ, అదెలా సాధ్యం.? ఏమో, ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 5 వేలు మాత్రమే. కరోనా టెస్టుల సంఖ్య 70 వేల లోపే వుంది.
అదేంటీ, కొన్నాళ్ళ క్రితం లక్షా ముప్ఫయ్ వేల దాకా కరోనా టెస్టులు చేసిన తెలంగాణ, ఎందుకిలా అనూహ్యంగా టెస్టుల సంఖ్య తగ్గించేసింది.? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడంలేదు. టెస్టుల సంఖ్య పెంచాలంటూ హైకోర్టు పదే పదే హెచ్చరిస్తన్నా, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఫోకస్ పెట్టలేకపోతోంది. టెస్టింగ్ అలాగే ట్రేసింగ్.. వీటితోపాటు ట్రీట్మెంట్ చాలా ముఖ్యం కరోనా విషయంలో. ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే, అంత బాగా కరోనా వైరస్ జాడని కనుగొనవచ్చు, ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుంది. పొరుగు రాష్ట్రాలు రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు చేస్తున్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు కూడా చాలా ఎక్కువగా వుంది. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు నిత్యం వస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే వున్నప్పుడు, తెలంగాణలోనూ పాజిటివిటీ ఎక్కువే వుండాలి కదా.? అన్న ప్రశ్న కొందరిలో కలగడం సహజమే. ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డాక, తెలంగాణలో కరోనా వ్యవహారాలపై కొంత సందిగ్ధం నెలకొందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ శాఖను పర్యవేక్షిస్తున్న దరిమిలా ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రజల్లో మాత్రం టెస్టులు ఎక్కువ జరగకపోవడం, వ్యాక్సినేషన్ సరిగ్గా జరగకపోవడంతో ఆందోళన పెరిగిపోతోంది.