Effects of vitamin tablets: విటమిన్ టాబ్లెట్స్ వల్ల ఆరోగ్యానికి లాభమా….నష్టమా?

Effects of vitamin tablets: ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి ఎప్పటి నుండి వచ్చిందో అందరూ రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఉన్న మార్గాలు అనుసరిస్తున్నారు. వాటిలో ఒకటి విటమిన్స్ టాబ్లెట్స్ విరివిగా వాడటం. మనిషి శరీరంలో విటమిన్ లోపాలు చాలా సహజం, అయితే వీటికి ఏ విటమిన్ తక్కువ అయినా టాబ్లెట్స్ వాడటం ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది . విటమిన్ ఏ నుండి జింక్ వరకు ప్రతి ఒక్క దానికి ఈ క్యాప్సూల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. నిజానికి మనం తినే ఆహార పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటివాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు లభ్యమవుతాయి. కానీ మారుతున్న కాలాన్ని బట్టి, తిండి మీద కన్నా మందుల మీద ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

ఒక్కొక్క విటమిన్ లోపానికి ఒక్కొక్క టాబ్లెట్ వాడటం ఎందుకు అని మార్కెట్లో దొరుకుతున్న మల్టీ విటమిన్ టాబ్లెట్ లను వాడుతుంటారు. విటమిన్ టాబ్లెట్ ల వాడకం అందరికీ అవసరం ఉండదు. వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు వయసును బట్టి విటమిన్ టాబ్లెట్ల అవసరం ఎంత మోతాదులో ఉందో అంతనే ఉపయోగించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఆహారంతో విటమిన్ లోపాలను తగ్గించడం కష్టమవుతుంది. వృద్ధులకు విటమిన్ బి12, విటమిన్ డి, క్యాల్షియం వంటి పోషకాలు అవసరమవుతాయి.

మాంసాహారం తినని వారికి బి12 విటమిన్ తక్కువగా ఉంటుంది . మాంసాహారంలో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది , అందువల్ల మాంసాహారం తినని వారికి డాక్టర్లు టాబ్లెట్ లు లేదా సిరప్ లు సూచిస్తుంటారు. గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి విటమిన్ల అవసరం చాలా అధికంగా ఉంటుంది. ఎవరికి ఏ విటమిన్స్ , పోషకాలు ఎంత మోతాదులో అవసరం అనేది మనం లెక్కకట్టే చెప్పడం చాలా కష్టం. అందువల్ల డాక్టర్ల సలహాలను మరియు సూచనలను పాటించడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారికి విటమిన్ సి టాబ్లెట్స్ ఉపయోగించటం అనవసరం . ఒకవేళ వారు శరీరంలో విటమిన్ లోపంతో బాధపడుతుంటే వారి విటమిన్ల లోపాన్ని బట్టి అది ఎంత మోతాదులో అవసరమో, ఏ ఆహార పదార్థాలలో ఆ విటమిన్ లభ్యమవుతాయి అనేది తెలుసుకొని, పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.