మామూలుగా మనం తిన్న ఆహారం కొన్ని కొన్ని సార్లు సరిగ్గా జీర్ణం కాక డయేరియా బారిన పడుతూ ఉంటాం. దాంతో విరోచనాలు లాంటివి అవుతూ ఉంటాయి. లూజ్ మోషన్స్ లాంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పదే పదే బాత్రూంకి పరిగెత్తడం తో పాటు, లూజ్ మోషన్స్ కావడం వల్ల శరీరంలో ఉన్న నీరు మొత్తం బయటకు పోయి శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. అయితే ఇటువంటి సమయంలో చాలామంది ఆహారం తినడానికి భయపడుతూ ఉంటారు. ఇక వీరేచనాలు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అరటిపండు తినడం మంచిది. అరటిపండు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మోషన్ నార్మల్గా ఉంటుంది. అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపులో సాధారణ స్థితికి దోహదం చేస్తాయి.అలాగే తొక్క తీసిన యాపిల్స్ కూడా వీరేచనాలు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక మసాలాలు, పులుపు లేని తేలికపాటి ఆహారం తినటం మంచిదే. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తాగాలి. విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను తాగితే మంచిది.
వీటిలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తాయట. విరేచనాల వల్ల శరీరంలో పోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళు శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాదు మజ్జిగ అన్నిటికంటే ఎక్కువ ప్రభావవంతంగా మన జీర్ణవ్యవస్థను దారిలోకి తెస్తుంది. స్టమక్ అప్సెట్ అయినప్పుడు వికారం, కడుపు నొప్పి, క్రామ్ప్స్ మరియు కాస్త తల నొప్పిగా ఉంటుంది. ఇటువంటి సమయంలో రిలీఫ్ గా ఉండాలంటే అల్లం టీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో తురిమిన అల్లం వేసుకొని మరిగించుకోండి. ఆ తర్వాత నిమ్మరసం కానీ తేనె కానీ వేసి మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తీసుకుంటే సరిపోతుంది. వికారం వెంటనే తగ్గిపోతుంది.