Health Tips:ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆహారపదార్థాల వల్ల మంచి ఫలితం..!

Health Tips: పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. పీల్చే గాలి కాలుష్యం అవటం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. అనేకమంది ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆస్తమా, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడే వారు covid-19 బారిన పడితే ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మీ ఊపిరితిత్తులకు కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలవు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కాలుష్యం వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు అని వైద్యులు తెలిపారు.

తేనెలో శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గించగల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హెచ్చుగా ఉంటాయి. . తేనె శరీరంలో వాయు మార్గాన్ని శుభ్రపరిచి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కాపాడుతుంది. గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడకుండా కాపాడుతుంది.

గ్రీన్ టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గించడం వాపు తగ్గించడం వంటి లక్షణాలు గ్రీన్ టీ లో ఉన్నాయి. రోజులో రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుంది.

పసుపు శరీరానికి ఎంతో అవసరం. పసుపు శ్వాసకోస సంబంధిత వ్యాధుల వల్ల కలిగే వాపును తగ్గించగలదు. అందులో ఉన్న క్రియాశీల సమ్మేళనాలు సహజంగానే ఊపిరితిత్తులను శుభ్రపరుస్థాయి. పసుపును పాలల్లో , కూరల్లో వినియోగించవచ్చు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. శ్వాస కోశ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా వెల్లుల్లి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అల్లం శ్వాసకోశ సమస్యలను తగ్గించి ఊపిరితిత్తులు బాగా పని చేయడంలో ఉపయోగపడతాయని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.