బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్.. ఉదయం టిఫిన్ కి ఏది మంచితో తెలుసా..?

ఉదయం లేచిన తర్వాత శరీరానికి అవసరమైన శక్తి, ఉత్సాహాన్ని అందించేది అల్పాహారం. ఈ టిఫిన్ సరైన రీతిలో తీసుకోకపోతే రోజు మొత్తం అలసట, నిస్సత్తువ వెంటాడుతాయి. అందుకే చాలా మంది ఉదయాన్నే గుడ్డును తమ టిఫిన్‌లో తప్పక చేర్చుకుంటారు. గుడ్డులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు దాన్ని సూపర్ ఫుడ్ గా నిలబెట్టాయి. అయితే ఒక పెద్ద సందేహం ఎప్పటి నుంచో చాలా మందిలో ఉంది ఉడికించిన గుడ్డు మంచిదా..? లేక ఆమ్లెట్ మంచిదా..? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉడికించిన గుడ్డు తినడం సులభం, అలాగే ఆరోగ్యకరం. నూనె, వెన్న వాడకపోవడం వల్ల కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక్క గుడ్డు దాదాపు 70 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. బరువు తగ్గాలని, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని కోరుకునేవారికి ఇది అద్భుతమైన ఎంపిక. పైగా సులభంగా జీర్ణమవుతుంది, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి తినడానికి కూడా సులభంగా ఉండటంతో బిజీ జీవితానికి ఉడికించిన గుడ్డు సరైన టిఫిన్‌గా మారింది.

ఆమ్లెట్ అయితే వేరే రుచిని, వైవిధ్యాన్ని ఇస్తుంది. తక్కువ నూనెతో సాదా ఆమ్లెట్ తయారు చేస్తే అది కూడా ఆరోగ్యకరమే. అంతేకాదు, ఉల్లిపాయ, టమోటా, పాలకూర, పుట్టగొడుగులు వంటి కూరగాయలు కలిపితే అదనంగా ఫైబర్, విటమిన్లు, సూక్ష్మపోషకాలు అందుతాయి. ఆమ్లెట్ తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే ఒక జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి అదే ఎక్కువ నూనె, వెన్న లేదా చీజ్ జోడించకూడదు. లేదంటే అది ఆరోగ్యానికి మేలు కంటే ముప్పు అవుతుంది.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మీరు బరువు నియంత్రణ, తక్కువ కేలరీలు కావాలని చూస్తే ఉడికించిన గుడ్డే ఉత్తమం. రుచి, వైవిధ్యం, కడుపు నిండిన అనుభూతి కోరుకుంటే ఆమ్లెట్ మంచిది. రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. అంతిమంగా మీ శరీర అవసరాలు, జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలే ఏది మీకు సరైనదో నిర్ణయిస్తాయి.
అదే కాకుండా గుడ్డును ఎప్పుడు తింటే మంచిదన్న దానిపై కూడా వైద్యులు సూచనలు ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య గుడ్డు తినడం అత్యుత్తమం అంటున్నారు. ఈ సమయంలో శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. రాత్రి ఆలస్యంగా గుడ్డు తినడం అయితే జీర్ణక్రియకు భారంగా మారుతుందని సూచిస్తున్నారు.

మొత్తానికి, గుడ్డును ఏ రూపంలోనైనా టిఫిన్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మీకు సరిపడే రూపాన్ని ఎంచుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్డు బరువు తగ్గే ప్రయాణంలో తోడ్పడుతుంటే, ఆమ్లెట్ రుచి, పోషకాహారం కలిపి మరింత సంతృప్తిని ఇస్తుంది. కాబట్టి టిఫిన్‌ లో ఏ రూపంలో గుడ్డు చేరాలన్నది మీ అభిరుచే కాకుండా మీ ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.