Papaya: డెంగీ నుంచి మలబద్ధకం వరకు.. పచ్చి బొప్పాయి తింటే కలిగే అద్భుతాలివే..!

బొప్పాయి అంటే చాలా మందికి ఇష్టం. దీనిని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పచ్చి బొప్పాయిలో మరింత శక్తివంతమైన ఆరోగ్య రహస్యాలను దాగి ఉన్నాయి. సాధారణంగా వంటల్లో కూరగాయలా వాడుకునే ఈ పచ్చి బొప్పాయిని సలాడ్ రూపంలో తింటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే డెంగీ, మలేరియా వంటి జ్వరాలకు ఇది సహజ వైద్యం లాంటిదని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ A, విటమిన్ C శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్లేట్‌లెట్స్ స్థాయిలు పెరగడం వల్ల డెంగీ, మలేరియా నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇందులోని పొటాషియం, ఫోలేట్, ఖనిజాలు శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్‌ను సమతుల్యం చేస్తాయి. ఈ పండు ప్రత్యేకత పప్పెయిన్ అనే ఎంజైమ్‌. ఇది ప్రోటీన్‌ను విడదీసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అందువల్ల పచ్చి బొప్పాయి తినడం వలన జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మలబద్ధకం బాధపడేవారికి ఇది సహజ రెమిడీగా పనిచేస్తుంది. పైగా ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు కదలికలు సాఫీగా సాగుతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వలన అదనంగా తినే అలవాటు తగ్గిపోతుంది. సలాడ్‌గా లేదా సైడ్ డిష్‌గా పచ్చి బొప్పాయి తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఇక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన పచ్చి బొప్పాయి శరీరంలో మంట సమస్యలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు దూరంగా ఉండేలా సహాయం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

ఇదీ చదవండి: ఈ తేదీల్లో పుట్టిన భార్యలు.. భర్తకు అదృష్టం తెచ్చి పెడతారంట..!

నిపుణుల మాటల్లో, పచ్చి బొప్పాయి ప్రతి ఇంటి డైట్‌లో తప్పక ఉండాలని చెబుతున్నారు. పండిన బొప్పాయి తియ్యదనానికి మోజుపడుతున్నవారికి ఇది మరో రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్య రక్షణ దళంలా పనిచేస్తుంది. అందుకే ఇకపై పండిన బొప్పాయి కోసం మాత్రమే కాకుండా, పచ్చి బొప్పాయి కోసం కూడా మీ ఫ్రూట్ బాస్కెట్‌లో స్థానం ఇవ్వడం మర్చిపోకండి. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు. దీనిని ఫాలో అయ్యే ముందు.. వైద్యుల సలహా తీసుకోండి.)