Blood Sugar Levels: చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!

Blood Sugar Levels: సాధారణంగా మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆహార పద్ధతుల్లో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వయసు వ్యత్యాసం లేకుండా చిన్న పిల్లలను సైతం అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అందరిని ఇబ్బంది పడుతున్న సమస్యలలో బీపీ,షుగర్ వంటి సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పటంలో సందేహం లేదు. ముఖ్యంగా చలికాలంలో షుగర్ లెవెల్స్ అదుపు చేయటానికి పాటించాల్సిన చిట్కాలు గురించి తెలుసుకుందాం.

చలికాలంలో చలి తీవ్రత వల్ల సాధారణంగా ఎక్కువ ఆకలిగా ఉంటుంది. తద్వారా షుగర్ వ్యాధితో బాధ పడేవారు అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం వుంటుంది. ఈ సుగర్ లెవల్స్ ని అదుపు చేయడానికి తీసుకునే ఆహారంలో ఆకు కూరలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. తీయని పానీయాలు, కాఫీ, టీ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామాలు చేయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. చలికాలంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ మీద ప్రభావం చూపుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారు.

షుగర్ వ్యాధి రావటానికి మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల టైప్-2 డయాబెటిస్​ తలెత్తే ప్రమాదం ఉంటుంది.అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న వ్యాయామాలు యోగ వంటివి చేయటం వల్ల అధిక ఒత్తిడి సమస్య నియంత్రించవచ్చు. యోగా,వ్యాయామం చేయటం వల్ల అధిక ఒత్తిడి సమస్య తగ్గి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చు.