చలికాలం వచ్చిందంటే వెంటనే జలుబు, దగ్గుతో పాటు ఇప్పుడు మరో పెద్ద ఆరోగ్య సమస్య ప్రజలను వెంటాడుతోంది. అదే సైనసైటిస్. నగరాల్లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం, ధూళి, వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ప్రభావంతో ప్రస్తుతం సైనసైటిస్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే తలనొప్పి, ఒత్తిడి, ముక్కు బ్లాక్ అవడం వంటి సమస్యలతో చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
సైనసైటిస్ అనేది ముక్కులోని గదుల్లో వాపు రావడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. దీనితో బాధపడేవారిలో తల బరువెక్కినట్టుగా అనిపించడం, కళ్ల చుట్టూ నొప్పి, చెవుల్లో ఒత్తిడి, వాసన పూర్తిగా తగ్గిపోవడం, శ్వాసలో దుర్వాసన, గొంతులో కఫం వంటి ఇబ్బందులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. కొందరికి తల తిరగడం, శరీరం నీరసంగా మారడం కూడా సాధారణంగా కనిపిస్తోంది.
వైద్యులు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. చలికాలంలో నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని. ముఖ్యంగా ధూమపానం చేసే వారిలో సైనసైటిస్ వేగంగా ముదిరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి ప్రారంభమైన చిన్న ఇబ్బందే, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పెద్ద సమస్యగా మారుతుందని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, రోజుకు ఎక్కువసార్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కోల్డ్ డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలు, బాగా చల్లగా లేదా అతిగా వేడిగా ఉండే పదార్థాలను చలికాలంలో తగ్గించడమే మంచిదని చెబుతున్నారు. బయట తినే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మద్యం, చాక్లెట్లు, ప్రాసెస్డ్ బ్రెడ్‌లు సైనసైటిస్ సమస్యను మరింత పెంచుతాయని నిపుణుల మాట.
ఆహారంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి సహజ రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను చేర్చుకుంటే శ్వాస మార్గాలు బలపడతాయని, పచ్చి కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లకు ఎదురొడ్డి నిలబడే శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. అలాగే రోజూ నడక, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుందని స్పష్టం చేస్తున్నారు.
వైద్యులు మరో ముఖ్య సూచన కూడా చేస్తున్నారు. తలనొప్పి సాధారణమే అని నిర్లక్ష్యం చేయకుండా, ముక్కు మార్గాల్లో ఎక్కువ రోజుల పాటు బ్లాకేజ్, కఫం, వాసన కోల్పోవడం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే సైనసైటిస్ అనే సమస్య నుంచి చలికాలంలో సురక్షితంగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
