Vande Bharat Express: గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త, విజయవాడ – చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం నేడు కార్యరూపం దాల్చింది. నరసాపురం రైల్వే స్టేషన్లో పొడిగించిన ఈ వందేభారత్ సర్వీసును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవం నరసాపురం రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్తో కలిసి జెండా ఊపి రైలును ప్రారంభించారు. అంతకుముందు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, విప్ నాయకర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్టేషన్కు చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం కేంద్రమంత్రి, ఇతర ప్రముఖులు నరసాపురం నుండి గుడివాడ వరకు వందేభారత్ రైలులో ప్రయాణించారు.
వందేభారత్ షెడ్యూల్ (జనవరి 11 వరకు) విజయవాడ మీదుగా నడిచే ఈ రైలు వారంలో మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు అందుబాటులో ఉంటుంది. 530 మంది ప్రయాణించే సామర్థ్యం గల ఈ రైలు షెడ్యూల్ ఉంది.

నరసాపురం టు చెన్నై: మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపురంలో బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
చెన్నై టు నరసాపురం: ఉదయం 5:30 గంటలకు చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ప్రస్తుతం ఈ సమయ పట్టిక జనవరి 11వ తేదీ వరకు తాత్కాలికంగా అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

