Chiranjeevi : ఇది పక్కా, జనసేన తరఫున చిరంజీవి ప్రచారం చేస్తారట.!

Chiranjeevi : మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా వున్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదనీ, చట్ట సభలకు వెళ్ళాలన్న ఆలోచన అసలే లేదనీ ఇటీవల చిరంజీవి స్పష్టం చేసిన విషయం విదితమే. అయినాగానీ, చిరంజీవి 2024 ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2024 ఎన్నికల్లో చిరంజీవి తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గ పెద్దలు ఈ విషయమై చిరంజీవి మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట.

రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కాపు సామాజిక వర్గ ప్రముఖులు వివిధ పార్టీలో వున్న కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కొత్త పార్టీ ప్రస్తావనను కొందరు తీసుకొచ్చినా, ఆ ప్రస్తావనకు పెద్దగా మద్దతు లభించలేదట.

‘చిరంజీవి గనుక జనసేనకు బాహాటంగా మద్దతు తెలిపితే, జనసేన తరఫున ప్రచారం చేస్తే.. మేం కూడా జనసేన వెంట నడుస్తాం..’ అంటూ వివిధ పార్టీలో వున్న కొందరు కాపు నేతలు, కాపు సామాజిక వర్గ పెద్దలకు చెప్పారంటున్నారు. ఈ విషయమై ఇంకా చిరంజీవి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలే కాకుండా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నారంటూ ఓ ప్రచారమైతే తెరపైకొచ్చింది. ఇదంతా జనసేన కోసం చేస్తున్న ‘చివరి ప్రయత్నం’గా భావించాలా.? లేదంటే, ఇది కేవలం ఓ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా.? ఏమో, వేచి చూడాల్సిందే.