బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే హాలీవుడ్‌లో స్థిరపడ్డారు ప్రియాంక చోప్రా. అక్కడకు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్కడి వారెవరూ కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు.’భారత్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌పై నా ఫొటో ఆరుసార్లు వచ్చింది. విదేశాలకు వచ్చాక ఎవ్వరూ కనీసం నాతో ఒక విూటింగ్ కూడా నిర్వహించలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, తిరస్కరణలు అనుభవించాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మౌనంగా నాపని నేను చేశాను.
అదే ఈరోజు హాలీవుడ్‌లోనూ నాకు గుర్తింపు రావడానికి కారణమైంది. భారత్ నుంచి ఇక్కడకు రాగానే ఎంతో భయపడ్డాను. నాకు తెలియని పరిశ్రమ, పలకరించేవారు ఎవ్వరూ లేరు. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న భావన మనసును కుంగదీసేది. అయినా ధైర్యంగా ముందుకు సాగాను’ అని చెప్పారు.
గతంలో ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లోని రాజకీయాలకు విసిగిపోవడం వల్లే హాలీవుడ్ లో స్థిరపడ్డాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘హిందీ చలన చిత్ర పరిశ్రమలో నన్ను ఓ మూలకు తోసేశారు. ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వట్లేదు. పలువురితో విభేదాలు ఏర్పడ్డాయి. అక్కడ రాజకీయాలు ఉంటాయి. వాటితో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనిపించింది. అలా అమెరికా వచ్చేశా‘ అని చెప్పారు. ఇటీవల తన భర్తతో కలిసి ‘లవ్ అగైన్’ తో అలరించిన ప్రియాంక.. ‘హెడ్ ఆఫ్ స్టేట్’ అనే యాక్షన్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్వరలో విడుదల కానున్న’టైగర్’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అందిస్తున్నారు.