తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ కి యాభై వేలు ఓట్లు వస్తాయా?

ap bjp

వైఎస్సార్ కాంగ్రెస్ నేత తిరుపతి ఎంపీ బల్లి దుర్గ ప్రసాద రావు మృతితో త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో విజయం తర్వాత  పట్టపగ్గాలు లేని బీజేపీ తిరుపతిలో కూడా విజయం సాధిస్తామని బీరాలు పోతున్నది.

ap bjp
ap bjp

దుబ్బాక వేరు తిరుపతి వేరు అని రాజకీయాల్లో  ఏమాత్రం అవగాహన వున్నవారికైనా తెలుసు. అక్కడ బీజేపీ బలం కంటే అభ్యర్థి మీద సానుభూతి మరి ప్రభుత్వం పై వ్యతిరేకత కలిసి బీజేపీ విజయానికి దోహదపడ్డాయి.

తిరుపతి నియోగకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు మారుతూ వుంటారు. అందుచేత ఏ పార్టీ కి బలమైన అభ్యర్థి వుండరు. ఇక్కడ పని చేసేదంతా పార్టీ భలం మరియు నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గం ఇంచార్జిల భలమే ముఖ్యం.

ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లా కి సంబంధించిన తిరుపతి టౌన్, కాళహస్తి, సత్యవేడు మరియు నెల్లూరు జిల్లాకి సంబంధించి సూళ్లూరుపేట, సర్వేపల్లి, వేంకటగిరి, గూడూరు నియోజకవర్గాలు వున్నాయి. 2019 ఎన్నికల్లో ఏడింటికి ఏడు వైస్సార్సీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అన్ని చోట్ల వైస్సార్సీపీకి తెలుగుదేశమే ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది.

ఆ ఎన్నికల్లో జనసేన తిరుపతి మరియు కాళహస్తి నియోజకవర్గాల్లో మాత్రమే ఐదు వేలు పై ఓట్లు సాధించి మిగతా చోట్ల నోటా తో పోటీ పడింది. జనసేన ఎంపీ సీట్ మాత్రం మిత్రపక్షం బీఎస్పీ కి కేటాయించగా, దగ్గుమాటి శ్రీహరి రావు పోటీ చేసి కేవలం ఇరవై వేలు ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు.

బీజేపీ అయితే మరీ అద్వానంగా అసెంబ్లీకి అన్ని చోట్ల నోటాతోనే మా పోటీ అన్నట్టు సాగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మి శ్రీహరి రావు కి కేవలం పదహారు వేలు ఓట్లు మాత్రమే దక్కాయి.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైస్సార్సీపీ మొదటి స్థానం తెలుగుదేశం రెండో స్థానంలో నిలవగా మూడో స్థానంలో నోటా ఉందంటే బీజేపీ మరియు జనసేన పరిస్థితి మనం అర్థం చేసుకోవొచ్చు.

స్థూలంగా చూస్తే అప్పటికి ఇప్పటికి పరిస్థితులేమి పెద్దగా మారలేదు. ప్రధాన పార్టీల భలం తరగలేదు బీజేపీ జనసేన పార్టీల భలం పెరగలేదు. ఇటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందంటే ఎవ్వరూ నమ్మరు .

వైస్సార్సీపీ మరియు టీడీపీ పోటీలో వుండి ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి లక్ష ఓట్లు వస్తే అది ఘనవిజయంగా భావించాలి. ఒక వేళ తెలుగు దేశం పోటీ నుండి తప్పుకొని బీజేపీ కూటమికి మద్దతిస్తే నియోజకవర్గం లోని తెలుగు దేశం క్యాడర్ మొత్తం అధికారపార్టీ తో గొడవెందుకులే అని సైలెంట్ అయ్యే అవకాశం వుంది. ఆ పరిస్థితుల్లో వైస్సార్సీపీ గతంలో వచ్చిన రెండు లక్షలు మెజారిటీ కంటే ఎక్కువే సాధించే అవకాశం వుంది.

పై రెండింట్లో ఏది జరిగినా అది బీజేపీ కి వున్న ఒక కృత్రిమ బలాన్ని ప్రజలకి బహిర్గతం చేస్తుంది. బీజేపీ వాళ్ళు తిరుపతి ఎన్నికలను టీవీల్లో కాకుండా ప్రజల్లో ఎలా ఎందుర్కొంటారో వేచి చూడాల్సిందే!!