తిరుపతి బై పోల్స్: ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై స్పష్టత వస్తుందా.?

tirupati-by-polls-special-status-will-come-clarity-on-vizag-steel-plant

tirupati-by-polls-special-status-will-come-clarity-on-vizag-steel-plant

తిరుపతి సాక్షిగా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి అవడానికి ముందు.. అంటే 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అంతకు ముందే పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుగా సంక్రమించింది. అధికారంలోకి వచ్చాక, ప్రత్యేక హోదాని అమలు చేయాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కింది. ఇప్పుడు, ఇన్నేళ్ళకి.. ఆ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాల్సిన సరైన సందర్భమొచ్చింది. అదే తిరుపతి ఉప ఎన్నిక. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో వుంటారని జనసేన – బీజేపీ సంయుక్తంగా నిర్ణయం ప్రకటించిన దరిమిలా, ప్రత్యేక హోదా సంగతేంటి.? అని తిరుపతి ప్రజానీకం.. ఎక్కడికక్కడ బీజేపీని నిలదీయడానికి ఆస్కారమేర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల్లోనూ ఆ అవకాశం వచ్చినా, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రత్యేక హోదా విషయం ఒక్కటే కాదు, విశాఖ ఉక్కు వ్యవహారంపైనా భారతీయ జనతా పార్టీ సంకట స్థితి ఎదుర్కోనుంది తిరుపతి ఉప ఎన్నికల్లో. ప్రధాని, కేంద్ర హోం మంత్రి.. ఇలా పలువురు ముఖ్య నేతలు కమలం పార్టీ నుంచి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చే అవకాశం వుంది గనుక.. తిరుపతి సెగ ఏ స్థాయిలో బీజేపీకి తగలనుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఆయా అంశాల్లో నిలదీయాల్సిన టీడీపీ, వైసీపీలకూ సంకట స్థితి నెలకొంది. టీడీపీ అయినా, వైసీపీ అయినా.. బీజేపీని గట్టిగా విమర్శించడానికి సాహసించలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. కాగా, జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థే బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. మరోపక్క, తిరుపతి ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనదిగా వుండబోతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.