2019 ఎన్నికల్లో తాము గెలుచుకున్న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవడం మామూలుగా అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. సిట్టింగ్ ఎంపీ అకాల మరణంతో తిరుపతిలో ఉప ఎన్నిక తప్పనిసరైంది. సిట్టింగ్ ఎంపీ తనయుడికి కాకుండా వేరొకరికి సీటు ఇచ్చేందుకు వైసీపీ వ్యూహం రచించిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ – జనసేన మధ్య జరిగిన అభ్యర్థి ఎంపిక పోటీలో, బీజేపీ పై చేయి సాధించింది.. జనసేన ఓడిపోయింది. నిజానికి, ఇది జనసేన ఓటమి కాదట.. గెలుపుకి తొలి మెట్టు అట. వైసీపీ – బీజేపీ మధ్య తెరవెనుకాల స్నేహం గడచిన కొంత కాలంగా సాగుతోంది.
తిరుపతి ఉప ఎన్నికతో అసలు సంగతేంటో తేలిపోతుంది. దుబ్బాక ఉప ఎన్నిక తరహాలో, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల తరహాలో బీజేపీ పోరాడతామని మాటిస్తే, తిరుపతి టిక్కెట్ బీజేపీకి వదిలేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అంటే, తెలంగాణలో అధికార పార్టీని మట్టికరిపించినట్లుగా బీజేపీ, తిరుపతిలో ఏపీలోని అధికార పార్టీ అయిన వైసీపీని దెబ్బకొట్టాలన్నమాట. ఇదే జనసేనాని అసలు సిసలు వ్యూహమంటున్నారు జనసైనికులు.
అయితే, బీజేపీ రాజకీయాల్ని ఆకళింపు చేసుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం.. ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ – జనసేన మధ్య పంచాయితీ ఓ కొలిక్కి రావడం.. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బీజేపీకి తిరుపతిలో బలం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, బీజేపీ పోటీలోకి దిగిందంటే.. ఎక్కడో తేడా కొడుతోంది. ఆ ‘మ్యాజిక్’ ఏంటన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరహాలో పొలిటికల్ హీట్ బీజేపీ కారణంగా తిరుపతిలో పెరిగితే మాత్రం, ముందు ముందు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనుండడం నిస్సందేహమే.