జనసేన, బీజేపీ పొత్తులో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేనకు ఓటు బ్యాంకు ఎక్కువ. పవన్ కళ్యాణ్ స్థాయి జనాకర్షణ కలిగిన నేతలు బీజేపీలో ఒక్కరూ లేరనేది వాస్తవం. అలాంటి వారే ఉంటే అసలు జనసేనను చేరదీయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది. మొదట్లో జనసేన, బీజేపీల కూటమికి పవనే మెయిన్ ఫేస్ అని అందరూ అనుకున్నారు. కానీ మెల్లగా సీన్ మారిపోయింది. పవన్ లోని అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని జనసేనను నియంత్రించే స్థాయికి వెళ్ళిపోయింది బీజేపీ. ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాట ఎత్తడంలేదు. అసలు తిరుపతి ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థినే నిలబెట్టాలని భావిస్తోంది.
మొదటి నుండి బీజేపీ ఏకపక్ష తీరుతో అసహనంగా ఉన్న జనసేన నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక దశలో పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి రాష్ట్ర శాఖ తీరు మీద కంప్లైంట్ చేయడం, గుట్టుగా పై నుండి బీజేపీకి హెచ్చరికలు రావడం జరిగింది. ఆ తర్వాత సోము వీర్రాకు ఎక్కడా తిరుపతిలో నిలబడబోయేది బీజేపీ అభ్యర్థేనని అనలేదు. అలాగని జనసేనకు సీటును వదిలేయడానికి కూడ వారు సిద్ధంగా లేరు. ఈ విషయమై పవన్, సోము వీర్రాజుల నడమ ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదు. ఈ నేసథ్యంలో పవన్ నిన్న తిరుపతి పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో శ్రేణులు, నాయకులు ఉప ఎన్నికల సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే దక్కాలని పట్టుబట్టారట. ఏ కోశానా బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించే ఆలోచనలో లేమని చెప్పేశారట. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిని మనకే వదిలేయాలని తీర్మానానికి వచ్చారట. పవన్ సైతం వారికే సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి తిరుపతిలో పోటీ చేయాలని అనుకున్న బీజేపీ ఆశలకు గండిపడ్డట్టే. పవన్ త్వరలో తన నిర్ణయాన్ని హైకమాండ్ వద్దకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా పవన్ భయపడే రకం కాకపోవడమే. ఇంకెవరైనా అయితే నయానో భయానో దారికి తెచ్చుకునేవారు. కానీ అక్కడున్నది పవన్. ఏ రకంగానూ లోగదీసుకోవడం సాధ్యంకాదు. కాదు కూడదు అంటే దణ్ణం పెట్టి పొత్తును తెంచుకుపోతాడు. అది చివరకు బీజేపీకే నష్టం.