Bheemla Nayak : ‘భీమ్లానాయక్’ సినీ పరిశ్రమకు అసలు సిసలు పరీక్ష.!

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి, టిక్కెట్ల ధరల మాటేమిటి.? దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

రోజుకు ఐదు ఆటల దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే సినీ పరిశ్రమకు హామీ ఇచ్చారు. మరి, బెనిఫిట్ షోలు వుంటాయా.? అంటే, దీనిపై ఇంకా స్పష్టత లేదు. తొలి వారం టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారా.? అంటే, దానిపైనా గందరగోళం కొనసాగుతోంది.

‘భీమ్లానాయక్’ తర్వాత, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు రంగంలోకి దిగాల్సి వుంది. నిజానికి, ‘భీమ్లానాయక్’ సినిమాని ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో పోల్చలేం. అలాగని, ‘భీమ్లానాయక్’ని తక్కువ చేసి చూడలేం. దేనికదే ప్రత్యేకం.

అయితే, రెమ్యునరేషన్లను పక్కన పెట్టి నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, అది 100 కోట్లు దాటితేనే టిక్కెట్ల ధరల పెంపుకు వెసులుబాటు.. అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. సినిమా నిర్మాణం అంటే, అందులో నటీనటుల రెమ్యునరేషన్ ఖచ్చితంగా వుంటుంది కదా.?

ఏమో, ఏం జరుగుతుందోగానీ, పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందా.? లేదా.? అన్నదానిపై ‘భీమ్లానాయక్’ సినిమాతోనే స్పష్టత వచ్చేస్తుంది. అందుకే, ‘భీమ్లానాయక్’ విడుదల కోసం పరిశ్రమ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ పరీక్షలో పరిశ్రమ పాస్ అవుతుందా.? వేచి చూడాల్సిందే.