ఏపీలో జనసేన పార్టీ బలోపేతమవుతోందిగానీ..

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైపోతున్న మాట వాస్తవం. అది కళ్ళ ముందరే కనిపిస్తోంది. టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీలోకి దూకేశారు, దూకేస్తూనే వున్నారు. ఎప్పుడూ అధికార పక్షం వైపే తూకం వుంటుందని అనుకోలేం, తూకం ఒక్కోసారి విపక్షాల వైపు కూడా మొగ్గు చూపుతుంది. అయితే, ఇక్కడ విపక్షం నానాటికీ దిగజారిపోతోంది.. ప్రతిపక్షం టీడీపీ రూపంలో. విపక్షాల్లో మరో ప్రధాన పార్టీ జనసేన. బీజేపీతో జనసేనకు పొత్తు వుంది. అయితే, బీజేపీ ఎంత గింజుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశమే లేదు.

నిజానికి, బీజేపీకి జనసేన దూరమైతేనే.. జనసేనకు కాస్తో కూస్తో లాభం. జనసేన బలపడుతున్నా.. ఆ బలం కనిపించకపోవడానికి ప్రధాన కారణం బీజేపీనే. కాంగ్రెస్ అసలు ఏపీలో తేరుకునే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ రెండేళ్ళ పాలన మొన్నీమధ్యనే పూర్తయ్యింది.. పార్టీలో, ప్రభుత్వంలో చాలా మార్పులు జరుగుతున్నాయి.. ఇంకా జరుగుతాయి కూడా. ఈ నేపథ్యంలో తలెత్తే చిన్నపాటి అసంతృప్తి అయినా, రాజకీయ ప్రత్యర్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఆ మేలు తాజా అంచనాల ప్రకారం, జనసేనకే జరిగే అవకాశముంది. ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. అధికార పార్టీకి సాఫ్ట్ టార్గెట్ అవకుండా ఆచి తూచి అడుగులేస్తున్నారు జనసేనాని. ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈలోగా సినిమాలు పూర్తి చేసేస్తే, ఆర్థికంగానూ జనసేనకు అది మేలు చేస్తుంది. ఇంకోపక్క, జనసైనికులు కింది స్థాయిలో రాజకీయంగా పనులు చక్కబెట్టేస్తున్నారు.. అంటే, ప్రజలకు చేరువవడమన్నమాట. కరోనా నేపథ్యంలో జనసైనికులు స్వచ్ఛందంగా చేసిన సేవ, చాలామంది ఓటర్లను కదిలించింది. అయితే, ఒక్క తప్పడుడు అధినేత వేస్తే.. ఈ కష్టమంతా వృధా అయిపోతుందన్నది జనసైనికుల ఆవేదన. మరి, ప్రతిపక్షం నిర్వీర్యమైపోతున్న దరిమిలా, జనసేన ఆ గ్యాప్ ఎలా భర్తీ చేయగలుగుతుందన్నది వేచి చూడాల్సిందే.