విశాఖకు క్యాపిటల్ హోదా.. కొత్త వెలుగులు షురూ.!

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా హైద్రాబాద్ తర్వాత అంతటి ‘స్థాయి’, ‘సామర్థ్యం’ వున్న నగరం ఇంకేదన్నా వుందంటే అది విశాఖపట్నం మాత్రమే. విశాఖపట్నం, వైజాగ్.. పేరేదైతేనేం.. ఈ ఉక్కు నగరానికి అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని.. అన్న చందాన రాజకీయం, ఈ ఉత్తరాంధ్ర నగరాన్ని వెనక్కి నెట్టేస్తూ వచ్చింది. ఎంత తొక్కితే అంత పైకి లేస్తుందన్న చందాన, విశాఖ తన ఉనికిని మరింతగా నిలబెట్టుకుంటూనే వస్తోంది. చంద్రబాబు హయాంలో విశాఖకు రాజధాని అయ్యే అవకాశం వస్తే, దాన్ని అప్పట్లో తొక్కిపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా లభించే అవకాశమొస్తే, దానికీ రాజకీయం అడ్డు తగులుతోంది. కానీ, కేంద్రం.. తాజాగా విశాఖపట్నంను ‘క్యాపిటల్’గా గుర్తించేసరికి, సోకాల్డ్ హేటర్స్ ఉలిక్కి పడ్డారు.

నిజానికి, కేంద్రం పెట్రో ధరల విషయమై ఓ నివేదిక విడుదల చేస్తూ, అందులో విశాఖను రాజధానిగా పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్ని శాంపిల్‌గా తీసుకుని, పెట్రో ధరలకు సంబంధించిన వివరాల్ని పేర్కొన్నారు. అలా క్యాపిటల్ అయ్యిందే తప్ప, విశాఖ.. ఇప్పటికిప్పుడు ఏపీ రాజధాని అయ్యిందనడానికి వీల్లేదు. రేప్పొద్దున్న హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వస్తే, అదో రచ్చ అయ్యే అవకాశమూ లేకపోలేదన్నది మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుతం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ మాత్రమే నిఖార్సయిన రాజధాని అవగలదు. దాన్ని రాజధానిగా ఇంకాస్త అభివృద్ధి చేస్తే, రాష్ట్రానికి అవసరమైన ఆదాయాన్ని అందించగలదు. మరి, అమరావతి సంగతేంటి.? అంటే, నో డౌట్.. అమరావతిని కూడా అభివృద్ధి చేయాలి. కర్నూలులో న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేసి తీరాల్సిందే.