ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. శాసనసభ వేదికగా మాట్లాడిన ఆయన, డ్రైవర్ల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ సేవలో. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు దీన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
ప్రతి ఏడాది అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌కి రూ.15వేలు ఆర్థిక సాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 2.9 లక్షల మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లు క్లియర్ చేసుకోవడం, వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండటం వంటి అర్హతలతో ఉన్నవారికి ఈ సాయం అందుతుందని సీఎం తెలిపారు. ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో తప్పిపోయినా, వారి సమస్యలను పరిష్కరించి వారిని కూడా చేర్చుతామని భరోసా ఇచ్చారు.
ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.435 కోట్ల నిధులు కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12వేలు మాత్రమే ఇచ్చిందని, తాను ఇప్పుడు రూ.15వేలు అందిస్తున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇది కేవలం డబ్బు సహాయం కాదని, డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలిచే భరోసా అని ఆయన స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఈ పథకం ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో హామీలలో భాగమని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలతో రాష్ట్ర పునర్ నిర్మాణం జరుగుతుంది అని అన్నారు.
అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా సీఎం ప్రకటించారు. పించన్ల పంపిణీ కార్యక్రమంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ రెండు కార్యక్రమాలు రాష్ట్రంలో పేదల జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యక్ష లబ్ధి చేరేలా రూపొందించిన ఈ కొత్త పథకం, వారి కుటుంబాలకు జీవనాధారంగా నిలవనుంది. డ్రైవర్ల సంఘాలు ఇప్పటికే ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 4న జరిగే కార్యక్రమంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
