ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లు నీటమునిగిపోయి, వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించగా, పల్లెల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో ఆందోళన కలిగించే హెచ్చరికను విడుదల చేసింది.. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే మూడురోజులుగా కురుస్తున్న కుండపోత వానలు రైతులను, పట్టణ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. తాజాగా ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళా ఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల నుంచి లోతట్టు జిల్లాల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, శుక్రవారం నుంచి కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ప్రజలు బయటకు వెళ్లడం తగ్గించాలని, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరికలు జారీ చేసింది.
ఇక వర్షాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ అయింది. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అత్యవసర సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రులు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎక్కడైనా గండ్లు పడే అవకాశం ఉంటే ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, మోటర్లు, జనరేటర్లు, బొట్లు వంటి అత్యవసర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ చేయాలని సూచించారు.
ప్రస్తుతం వర్షపాతం గణాంకాలు చూస్తే వరుణుడు ఏకంగా విరుచుకుపడుతున్నాడని స్పష్టమవుతోంది. కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5 మిల్లీమీటర్ల వర్షపాతం, రావులపాలెంలో 92.2 మిమీ, ముమ్మిడివరంలో 90.7 మిమీ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5 మిమీ, గంగవరంలో 83.7 మిమీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా రాపూర్‌లో 78.5 మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 76 మిమీ వర్షం కురిసింది.
మరోవైపు, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ బ్యారేజీలు, చెరువులు, తోటల సాగు ప్రాంతాలు క్షుణ్ణంగా పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పారు. మొత్తం మీద వరుణుడి అప్రతిహత దాడితో రాష్ట్రం అంతా ముంచెత్తే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు మైదానంలో ఉన్నా, వర్షాల ప్రభావం తగ్గే సూచనలు మాత్రం కనబడట్లేదు. ప్రజలు వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
