హైకోర్టు తీర్పుతో చెలగాటం..సర్కారుకు మరోసారి మొట్టికాయలు తప్పవా  

 

హైకోర్టు తీర్పుతో చెలగాటం..సర్కారుకు మరోసారి మొట్టికాయలు తప్పవా  

 
ఇప్పటికే రంగుల జీవో విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.  ఈ వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ సెక్రెటరీలు నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.  అయినా సర్కార్ తీరులో మార్పు కనిపించడం లేదు.  ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం చేసిన సంసంస్కర చెల్లదని, ఆర్డినెన్సును సైతం హైకోర్టు రద్దు చేసింది.  అంటే దానికి అనుభంధంగా వెలువడిన జీవోలన్నీ రద్దు అయినట్టే లెక్క.  దీంతో రమేష్ కుమార్ తాను మళ్లీ ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు సర్క్యులర్ జారీ చేశారు.  
 
దాన్ని అటెస్ట్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యదర్శి జీవిఎస్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు పంపారు.  కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ తనంతట తాను పదవిలో కూర్చోడవడం చెల్లదని వాదిస్తోంది.  ఈ మేరకు అడ్వకేట్ జనరల్ ఏస్.శ్రీరాం ప్రెస్ మీట్ పెట్టి రమేష్ కుమార్ స్వీయ పునరుద్దరణ చెల్లదని, దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపారు.  పైగా తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు లేఖ రాశామని అన్నారు.  ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నట్టుగా జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకుంటున్నట్టు మరో సర్క్యులర్ వదిలారు.  
 
ఈ వ్యవహారం మొత్తం చూస్తే నిమ్మగడ్డ ఎస్ఈసీ పదవిలో ఉండటం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టమవుతోంది.  ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదనప్పుడు ఆ ఆర్డినెన్సుకు ముందున్న పరిస్థితులే ఉండాలని అర్థం.  అప్పుడు రమేష్ కుమార్ పదవీ కాలం కుదింపు, ఆయన పదవి కోల్పోవడం లాంటివి ఉండవు.  అసలు నిమ్మగడ్డను తొలగిస్తూ ఆదేశాలేవీ ఇవ్వలేదు కాబట్టి మళ్లీ నియమిస్తూ ఆదేశాలు అవసరం లేదని, హైకోర్టు అంత గట్టిగా చెప్పినా ప్రభుత్వం నిమ్మగడ్డను వ్యతిరేకించడం, సుప్రీం కోర్టు నుండి స్టే తేకుండానే నియామకం చెల్లదని విత్ డ్రా సర్క్యులర్ జారీ చేయడం సరైన పద్దతి కాదని, ఇది కూడా హైకోర్టు ఉత్తర్వులను దిక్కరించడమేనని, మరోసారి మొట్టికాయలు తప్పవని అంటున్నారు.