తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుండి కేంద్ర ప్రభుత్వాలపై ధిక్కార ధోరణిలోనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీలే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడం అనే సాంప్రదాయాన్ని బద్దలుకొట్టాలనే ఆలోచన కేసీఆర్ మనసులో ఎన్నాళ్ళగానో ఉంది. అందుకోసమే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా ప్రయత్నాలే చేశారు. ప్రాంతీయ పార్టీల పాలనలో ఉండే రాష్ట్రాలతో స్నేహం కుదుర్చుకోవాలని అనుకున్నారు. ఆ దిశగా బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మామతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయవతిలతో చర్చలు జరిపారు.
ఒక దశలో ఆయన ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తున్నాయి అనుకునేలోపే ఇతర పార్టీల అధినేతలు పలు కారణాల రీత్యా వెనక్కు తగ్గడంతో ఫెడరల్ ఫ్రంట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ కేసీఆర్ మనసులో మాత్రం ఆ కోరిక అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కోరికను ముందుకు తీసుకెళ్లే అవకాశం కేసీఆర్ కు విద్యుత్ చట్టం సవరణ బిల్లు రూపంలో వచ్చింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు నష్టం:
ఈ బిల్లు ద్వారా విద్యుత్ రంగాలపై రాష్ట్ర అధికారాలు చాలా వరకు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతాయని, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని వర్గాలకి ఇచ్చే రాయితీలను తొలగించి పూర్తి ఛార్జీలని నిర్ణయించాల్సి వస్తుందని.. దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర విద్యుత్ కేంద్రాలు ధరల విషయంలో జాతీయ విద్యుత్ కేంద్రాలతో పోటీ పడలేక మూతబడతాయని, రోజుకు మెగా వాట్ విద్యుత్ వాడే వినియోగదారులు ఎక్కడ నుండైనా కొనుగోలు చేయవచ్చనే వెసులుబాటు కల్పిస్తే డిస్కంల ఆదాయం భారీగా దెబ్బ తింటుందనేది కేసీఆర్ వాదన. ఇదే విషయాన్ని తెలుపుతూ ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మోదీకి లేఖ ద్వారా తెలిపారు.
ఈ అవకాశాన్ని అస్త్రంగా మార్చాలి:
తెలపడంతోనే ఆగకుండా తమలానే ఏ రాష్ట్రాలైతే ఈ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయో వాటన్నింటిమీ ఒక్క తాటిపైకి తేవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది. మెజారిటీ రాష్ట్రాల్లో భాజాపా సర్కార్ ఉంది కాబట్టి వారెలాగూ బిల్లును అపోజ్ చేయరు. అందుకే బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఏపీ ప్రభుత్వాల వైపు కేసీఆర్ చూస్తున్నారట. ఒకవేళ ఈ అందరినీ కలుపుకుని ఈ బిల్లును పాస్ కాకుండా ఆపగలిగితే ఈ స్పూర్తితోనే భవిష్యత్తులో ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి ఒక బలమైన వేదిక ఏర్పాటు చేయవచ్చనేది కేసీఆర్ ప్రణాళిక కావొచ్చు.