ఇది మిరాకిల్.. కేసీఆర్ కంటే జగనే పాపులర్

రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల నడుమ పాలన విషయంలో పోలికలు రావడం సర్వసాధారణం.  ఎందుకంటే గతంలో రెండూ కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నాయి కాబట్టి.  అందుకే అభివృద్ది, పాలన లాంటి ముఖ్యమైన అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్యన పోలిక పెడుతుంటారు ప్రజలు.  ఓ సర్వే వెల్లడించిన ఫలితాలు చూసిన ప్రజలు ఇరు రాష్ట్రాలను పోల్చి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.  తాజాగా సీఓటర్-ఐఏఎన్ఎస్ సంయుక్తంగా దేశంలో పాపులర్ సీఎం ఎవరనే సర్వే చేపట్టింది.  ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నాల్గవ స్థానంలో ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ 16వ స్థానంలో ఉన్నారు.  తెలంగాణలో కేసీఆర్ పాపులారిటీ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు.  మొదటిసారి కంటే ఎక్కువ సీట్లు సాధించి ఆయన 2వసారి సీఎం అయ్యారు.  అలాంటి నేతకు తెలంగాణ ప్రజల్లో 54.26 శాతం మంది ప్రజలే మద్దతు పలికారు.  ఇక మొడటిసారి సీఎంగా భాద్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాలనపై ఏపీలో 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.  
 
సీనియర్, రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కంటే సీఎం పదవికి కొత్త అయిన వైఎస్ జగన్ ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పొందగలగడం విశేషమనే అనాలి.  ప్రజల్లో ఈ సంతృప్తి వెనుక వైఎస్ జగన్ నిరాటంకంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలే ప్రధాన కారణం.  ఆదాయం లేకున్నా జగన్ మాత్రం సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేస్తుండటం, మద్యపాన నిషేదం, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి నిర్ణయాలు జనాలకు బాగా నచ్చాయి.  అవే ఆయన్ను పాపులర్ సీఎంల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిపింది.  
 
ఇక జాబితాలో టాప్ 3లో 82.96 శాతం ప్రజల సంతృప్తిని దక్కించుకుని ఒడిశా సీఎం నవీన్ పాట్నాయక్ ఉండగా చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ 81.06 శాతంతో రెండవ స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ 80.28 శాతంతో మూడవ స్థానంలో ఉన్నారు.  ఇక దేశ ప్రధాని మోదీ పాలన పట్ల దేశవ్యాప్తంగా 65.59 శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సర్వే వెల్లడించింది.  ప్రధాని పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఏపీ నాల్గవ స్థానంలో ఉండటం మరో విశేషం.