నీకంటే తోపు ఎవరూ లేరు.. ఈ 5 విషయాల్లో అస్సలు రాజీపడకూడదంట..!

చిన్నప్పటి నుంచి మనకు ఒకటే మాట చెబుతూ పెంచుతారు.. త్యాగం గొప్పది, ఇతరుల కోసం బతకడం మంచిది అని. కానీ ఆ త్యాగం హద్దులు దాటితే మాత్రం మన జీవితమే నలిగిపోతుంది అన్న నిజాన్ని చాలా మంది ఆలస్యంగా గ్రహిస్తుంటారు. అందరినీ సంతోషపెట్టే క్రమంలో మన సంతృప్తిని, మన ఆరోగ్యాన్ని, మన కలల్ని మనమే పక్కకు నెట్టేస్తుంటాం. అసలైన నిజం ఏంటంటే.. మనం బలంగా ఉంటేనే పదిమందికి బలంగా నిలబడగలం. కొన్ని సందర్భాల్లో మనకు మనమే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు.. అది మన జీవితానికి ఇచ్చే బాధ్యత.

బంధాలు బలంగా ఉండాలంటే గౌరవం అనే పునాది తప్పనిసరి. ఎవరో పదే పదే మన భావాలను తక్కువ చేస్తూ, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే.. ఆ బంధం ఎంత పాతదైనా, ఎంత దగ్గరైనా అక్కడ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని నలిపేసే చోట మౌనంగా సహించటం కాదు, మన హద్దుల్ని స్పష్టంగా చెప్పగలగటం అసలైన ధైర్యం. మనల్ని తక్కువ చేసి చూసే చోట నిలబడటం కంటే, మనకు మనమే గౌరవం ఇచ్చుకోవడమే అసలైన సెల్ఫ్ లవ్.

ఆరోగ్యం విషయంలో మనం చేస్తున్న రాజీనే పెద్ద తప్పు. ఆఫీస్ పని ఒత్తిడితో, ఇంటి బాధ్యతలతో కృంగిపోయి టైమ్‌కి తినకపోవడం, నడవకపోవడం, నిద్రను త్యాగం చేయడం మనకు మనం చేస్తున్న అన్యాయమే. మన శరీరం జీవితాంతం మనతో ఉండే ఏకైక సంపద. రోజులో కాసేపైనా మన కోసం కేటాయించుకోవడం విలాసం కాదు.. అవసరం. మనం మంచం పట్టాక మన పనులు ఎవరు చేయరు, మన బాధ్యతలు మన కోసం ఎవరూ మోయరు.

అలసట హద్దులు దాటినప్పుడు కూడా ఇది చేయాలి, అది చేయాలి అంటూ మనల్ని మనమే నెట్టుకోవడం బలహీనత. శరీరం రెస్ట్ కావాలని సంకేతాలు ఇస్తుంటే వాటిని పట్టించుకోకపోవడమే మనకు మనం చేస్తున్న అతిపెద్ద ద్రోహం. ప్రతిసారి ‘అవును’ అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ‘నో’ చెప్పడం మన ఆరోగ్యానికి ఇచ్చే గొప్ప బహుమతి. ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం జీవితాన్ని వదిలేయడం కాదు.. మళ్లీ బలంగా తిరిగి వచ్చేందుకు సిద్ధం కావడం.

జీవితాన్ని మలిచే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మనసును వదిలేసి లోకాన్ని ముందు పెట్టడం చాలా మంది చేసే పొరపాటు. చదువు, ఉద్యోగం, పెళ్లి, భవిష్యత్తు.. ప్రతి విషయంలో ఇతరులు ఏమంటారు? అనే ప్రశ్న మనల్ని తరచూ బందీగా చేస్తుంది. కానీ ఆ నిర్ణయాల ఫలితాలను అనుభవించేది లోకం కాదు.. మనమే. అందుకే, ఒక అడుగు వేయాలంటే ముందు మన హృదయం ఏం చెబుతుందో వినాలి. మన మనసుకు నచ్చిన నిర్ణయమే మన జీవితాన్ని నిజంగా ముందుకు నడిపిస్తుంది.

మనశ్శాంతిని దిగజారుస్తున్న మనుషులే మన జీవితంలోని అతి పెద్ద దొంగలు. ప్రతి రోజు గొడవలు, ఏడుపులు, నెగెటివిటీతో మన మూడ్‌ను, మన ఆలోచనలను కలుషితం చేసే వాళ్ల నుంచి దూరంగా ఉండటం అహంకారం కాదు.. అది మన జీవన రక్షణ. ప్రశాంతంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మన శాంతిని పాడు చేసే ఏ విషయం అయినా సరే.. అవసరమైతే మౌనంగా పక్కకు పెట్టేయడం కూడా ఒక మహత్తర నిర్ణయమే.

మన కోసం మనం నిలబడకపోతే ప్రపంచం మన కోసం ఎప్పటికీ నిలబడదు. సెల్ఫ్ లవ్ అంటే అహంకారం కాదు, ఇతరుల్ని నిర్లక్ష్యం చేయడం కాదు.. మనలోని మనిషిని కాపాడుకోవడం. మన సంతోషం, మన ఆరోగ్యం, మన మనశ్శాంతి ఇవి కాపాడుకుంటేనే మన జీవితంలో నిజమైన విజయం ఉంటుంది. అందరికోసం జీవించడం గొప్పే.. కానీ మన కోసం కూడా బ్రతకడం అంతకంటే గొప్పది.