అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్ ద్వారా జరిగిన ప్రత్యేక సంభాషణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలను ఈ సంభాషణలో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై తమ జీరో టాలరెన్స్ విధానాన్ని ఇద్దరు నేతలు మరోసారి తేల్చిచెప్పారు.
భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా బలపడుతున్న నేపథ్యంలో ఈ సంభాషణకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణ, టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో జరుగుతున్న పురోగతిపై నెతన్యాహు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పరస్పర ప్రయోజనాల కోసం ఈ భాగస్వామ్యాన్ని ఇంకా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పాన్ని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
అదేవిధంగా తూర్పు మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఈ ఫోన్ సంభాషణలో చర్చ జరిగింది. గాజాలో శాశ్వత శాంతి నెలకొనేలా జరుగుతున్న ప్రయత్నాలను భారత్ సమర్థిస్తోందని ప్రధాని మోదీ స్పష్టంగా తెలిపారు. న్యాయబద్ధమైన శాంతి ప్రక్రియ వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, కాల్పుల విరమణ ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలవ్వాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లోనూ మానవత్వానికి ముప్పేనని ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇదిలా ఉండగా, డిసెంబర్‌లో భారత్‌కు రావాల్సిన నెతన్యాహు అధికారిక పర్యటన వాయిదా పడిన విషయం మరోసారి చర్చకు వచ్చింది. కొత్త తేదీని ఖరారు చేసేందుకు ప్రస్తుతం ఇజ్రాయెల్ అధికారులు భారత అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది. పర్యటన వాయిదా పడినప్పటికీ భారత్‌తో తమ బంధం బలంగా ఉందని, ప్రధాని మోదీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భద్రతా కారణాలతోనే పర్యటన వాయిదా పడిందన్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ వర్గాలు ఖండించాయి. ఆ వార్తలన్నీ తప్పుదారి పట్టించేవనే స్పష్టత ఇచ్చాయి. ఈ మొత్తం పరిణామాలు భారత్–ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా భద్రతా వ్యూహాలలోనూ మరింత లోతుగా పాతుకుపోతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి.
