వాహ్.. రాజమౌళి!

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా.. ఎక్కడవిన్నా దర్శకధీరుడి గురించే. ఆయనకు ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. కారణం లేకపోలేదు.. దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతటి గొప్ప వ్యక్తిని మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అందుకే ఈ ప్రశంసలు. టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటినుంచి దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకుంటూ వస్తున్న రాజమౌళికి అవార్డులు అనేవి కొత్తవికాకపోయినా.. ఈ అవార్డు మాత్రం ఖచ్చితంగా గొప్పదే అనొచ్చు.

విషయాల్లోకి వెళితే..న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) ‘త్రిబుల్ ఆర్’ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా కూడా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ ‘ఆర్.ఆర్.ఆర్’చిత్రంలో ఎన్ఠీఆర్ ‘కొమురం భీమ్’ పాత్రలో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించారు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ ఎంతో కీల‌క‌పాత్ర‌ పోషించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన‌ ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్, హాలీవుడ్ తార ఒలీవియా మొర్రీస్‌లు కథానాయిక‌లుగా ఓ మెరుపు మెరిపించారు.

ఆయా పాత్రల్లో వాళ్లు చక్కటి నటన కనబరిచి ఆద్యంతం విశేషంగా అన్నివర్గాల ప్రేక్షకుల్ని తమ అంద చందాలతో అలరించారు. ఫిబ్రవ‌రి 25న విడుద‌లైన ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సంచ‌ల‌నం విజ‌యం సాధించిందన్నది తెలిసిందే. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఇన్ ఎంటర్టైన్మెంట్’ అవార్డ్ లభించింది. చరణ్ తో పాటు ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూసూద్, తాప్సీలు ఈ అవార్డ్ రేసులో నిలిచారు. వీళ్లందరినీ వెనక్కునెట్టి రామ్ చరణ్ అవార్డు దక్కించుకున్నారు.