రవితేజకి ‘ధమాకా’ ఊరటనిచ్చిందా?

మాస్ మహారాజా రవితేజ, నవతరం బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’.ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. ఈ చిత్రం డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్టన్స్ రాబడుతూ పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ‘ధమాకా’ మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మంచి టాక్ తో మరింత పికప్ అయిన ఈ చిత్రం వీకెండ్ లో రెండో రోజు కూడా అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా లో రవితేజ మార్క్ వినోదం ఉండటంతో సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

కలెక్షన్ల పరంగా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదుచేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మొదటి రోజున 10 కోట్ల కనెక్షన్లను అందుకుంది. రెండవ రోజు కూడా అదే జోరును కంటిన్యూ చేసింది. ఆదివారం కూడా సినిమా కలెక్షన్లకు బాగానే పుంజుకున్నాయి. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం నైజాం ఏరియాలోని 5.5 కోట్లను వసూలు చేయగా, సీడెడ్ లో 2.4 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 5.2 కోట్లు చేసింది.

ఓవరాల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుందని ట్రెడ్ వర్గాల విశ్లేషణ. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్లు 15 కోట్లు అని తెలిసింది. సినిమా థియేటర్ రైట్స్ 19 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా 80 శాతం రికవరీ పూర్తి చేసి సెన్సేషన్ సృష్టించింది. అయితే.. సెకండ్ వీకెండ్‌లో రవితేజ ధమాకా.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వరుస పరాజయాలను చవిచూస్తున్న సమయంలో రవితేజ సినిమాకు బిజినెస్ భారీగానే జరిగిందని చెప్పాలి. రవితేజ ధమాకా సినిమాను మొత్తం మీద 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా కి మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఓవరాల్ గా 32 కోట్ల దాకా రికవరీ అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తొంది. రవితేజ మాస్ యాక్షన్ .. శ్రీలీల గ్లామర్ .. ఇద్దరూ కలిసి చేసిన మాస్ డాన్సులు .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. భీమ్స్ సంగీతం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

రవితేజ ఆ మధ్య రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ’, శరత్ మండవ దర్శకత్వంలో నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రెండు కూడా పరాజయాన్ని చవిచూశాయి. రెండు ఫ్లాపులతో ఉన్న రవితేజకి ఈ సినిమా రిజల్ట్ ఊరటను ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టాలనే శ్రీలీల కోరిక కూడా నెరవేరినట్టే. దగ్గరలో గట్టిపోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం రవితేజకి కలిసొచ్చిందనే చెప్పాలి.