ముత్తాత ఆలోచన, నాన్నమ్మ నినాదం, రాహుల్ పధకం!
(మల్యాల పళ్ళంరాజు)
దేశంలో పేదరికం తుడిచిపెట్టుకుని పోవాలని కోరుకోని భారతీయులు ఉండరు. అయితే, పేదరిక నిర్మూలనకు నడుం బిగించిన వారే చరిత్రలో నిలిచి పోతారు. 136 కోట్ల జనాభా గల మన దేశంలో పేదలు ఎంతమంది. వారిని దారిద్ర్య రేఖ నుంచి ఉద్ధరించేందుకు ఎన్నిలక్షలకోట్లు ఖర్చు చేయాలి అన్నది గొప్ప ప్రశ్న. పేదరికాన్ని తొలగించే ఏ పథకమైనా గొప్పదే. ఆర్థికపరమైన అంతరాలు, యువత పాలిట శాపంగా మారిన నిరుద్యోగం నిర్మూలన పై ప్రపంచంలో దాదాపు అన్నిదేశాలు దృష్టి పెట్టడం విశేషం.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా దేశంలో ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పించే ప్రతిపాదన చేశారు. రాహుల్ పథకం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. రాహుల్ గాంధీ ప్రతి పేదవాడికీ కనీసం ఆదాయం కల్పించాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి భారతీయుడికీ.. కాదు. ఆయన దృష్టిలో ఎవరు పేదవాడు. పేదరికానికి ఆయన నిర్వచనం ఏమిటో.. పేదరికం పై కాంగ్రెస్ పార్టీ నిర్వచనం ఏమిటో.. ప్రతి పేదవాడికి ఇవ్వదలచిన కనీస మొత్తం ఎంతో ఇప్పటికీ ప్రకటించలేదు. ఇలాంటి మహత్తర పథకం ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ దీనిని అమలు చేయాలంటే అవసరమైన వనరులు, వాటి సేకరణపై ఏమైనా సమగ్రమైన అధ్యయనం, సర్వేలు చేయించిందా.. అన్నదీ తెలియదు. ఉత్తర ప్రదేశ్ లాంటి ఓ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపడతారా, లేక దేశమంతా ఒకే సారి అమలుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుందా అన్నది తెలియలేదు. చిత్తశుద్ధితో ఈ పథకం అమలుకు సిద్ధమయ్యారా లేక కేవలం ఇది 2019 ఎన్నికల విజయం కోసం విసిరిన పాచిక అన్నది కాలమే నిర్ణయించాలి.
జాతిపిత మహాత్మాగాంధీ.. దేశంలో కనీసం వొంటిని కప్పుకునేందుకు బట్టలేని పేదలను చూసి, తాను పై బట్టను విసర్జించాడు. దార్శనికుడు, భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హయాం లోనే దేశంలో పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన ప్రణాళికలపై ఆలోచన సాగింది. ప్రతి భారతీయుడికి కనీస జీవన ప్రమాణాలు కల్పించడం ఎలా అన్నఅంశంపై 1962 ప్రాంతంలో మేధావులు, ఆర్థిక శాస్త్రవేత్తలు పథక రచనకు నడుం బిగించారు. అప్పటికి దేశ జనాభా 40 కోట్లను మించలేదు. 1962లో నెహ్రూ సూచనల మేరకు పితాంబర్ పంత్ నాయకత్వంలోని ప్రణాళికా సంఘంలోని ఆర్థిక నిపుణులు దాదాపు 15 ఏళ్ల తర్వాత.. అంటే 1977 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి కనీస జీవన ప్రమాణాలను కల్పించడం ఎలా అని విశ్లేషించారు. దేశ జనాభాలో ఐదో వంతు మేరకు ఉన్న పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే.. ఆర్థికవ్యవస్థ వేగవంతం కావాలని సూచించారు.
1972లో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ.. గరీబీ హటావో నినాదంతో జనం హర్షామోదాలు పొందారు. అప్పటికే బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ దేశంలో పేదరిక నిర్మూలనకు పలు పథకాలను ప్రవేశ పెట్టారు.
2019లో ఇందిరాగాంధీ మనుమడు రాహుల్ గాంధీ 1962 నాటి తన ముత్తాత కలలను, ఆలోచనలను నిజం చేసేందుకు నడుం బిగించినట్లు కన్పిస్తున్నది. భారతదేశం గ్రామీణ దేశం..గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక, కనీసం వ్యవసాయ భూమి లేక పేదరికంలో మగ్గుతున్న వ్యవసాయ కూలీలు, బడుగు, బలహీన వర్గాలకు కనీస ఆదాయం కల్పించే పథకం అమలు కావల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
దేశంలో పేదరిక నిర్మూలనకు ఇప్పటికే భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు పధకాలు చేపట్టి అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్నమహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ కూలీలు కరువు కాలంలో కూడా ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతున్నారు. నిరుద్యోగ యువత కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నది. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎందరో పేద విద్యార్థుల కడుపు నిండుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఇస్తున్నపింఛన్లు, ఉచిత బియ్యం సరఫరా పథకాల వల్ల రెండు పూటలా గుప్పెడు మెతుకులు తింటున్ననిర్భాగ్యులు ఎందరో. రైతులకు ఉచిత కరెంట్ సరఫరా, ఉచిత వైద్యం, ఉచితంగా చదువు కల్పించడం, పేద విద్యార్థులకు ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ వంటి పథకాలు కూడా పేదరిక నిర్మూలనలో భాగమే. అలాగే ప్రభుత్వాలు చేపడుతున్న వ్యవసాయ రుణాల రద్దు, తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతుబంధు పథకం. తొలకరి వర్షాల తర్వాత దుక్కి దున్నేందుకు, సాగు పనులకు వ్యవసాయ దారులు బ్యాంకులను, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి సాగు సాయం అందిస్తున్నది. ఎరువులపై సబ్సిడీ, రైతు పంట భీమా పథకాలు, కూడా పేదరిక నిర్మూలనలో భాగమే. ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నసబ్సిడీలు, రాయితీలను తొలగించిన పక్షంలో ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పించడం, నగదు బదిలీ వంటివి సాధ్యమేనని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వర్థిల్లుతున్న మనదేశంలో పలు పార్టీల ప్రభుత్వాలు చేపడుతున్న పేదరిక నిర్మూలన పథకాలు అన్నీ నిజంగా పేదలకు అందుతున్నాయన్న గ్యారంటీ లేదు.ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆయా పార్టీల కార్యకర్తల ఉపాధికల్పన పథకాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా నిజమైన పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు 100 శాతం అంతడం లేదు. ఇందుకు పథకాల అమలులో చిత్తశుద్ధి లోపించడం, అవినీతి ప్రధాన కారణాలు.
దేశంలో పేదలకు కనీస ఆదాయం కల్పించే పథకం చిత్తశుద్ధితో అమలు చేయాలంటే, దేశంలో పేదలకు సంబంధించిన గణాంకాలను తాజా డేటాతో సవరించాలి. 2011 -12 లో ఎన్ఎస్ఎస్ ఓ వినియోగదారుల వ్యయాలకు సంబంధించిన సర్వే జరిగింది. 2017- 18 లోనూ తాజా సర్వే జరిపారు కానీ, ఆ వివరాలేవీ ఇంకా వెల్లడి కాలేదు. ఈ సర్వే వివరాలు వెల్లడైతే దేశంలో పేదలు ఎంతమందో.. వారికి కనీసం ఏ మేరకు ఆదాయం కల్పిచాల్సి ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు.
రాహుల్ గాంధీ ప్రతిపాదనకు కొద్దిగా ముందే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2016- 17 లో ఆర్థికసర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ అన్న ప్రతిపాదన వచ్చింది. సమాజంలో ప్రతి వ్యక్తికి కనీస ఆదాయం కల్పించాల్సిన అవసరం ఉంది. మౌలిక అవసరాలు తీరి, జీవితాన్ని గౌరవప్రదంగా జీవించగలిగే మేరకు ఆ సహాయం, సౌకర్యాలు ఉండాలని యూబీఐ పేర్కొంది. ఇందుకోసం తెండూల్కర్ అనే ఆర్థికవేత్త 2011-12లో ప్రతిపాదించిన దారిద్ర్య రేఖను ప్రామాణికంగా చేపట్టి కనీస వార్షిక సహాయం రూ. 7,620 గా పేర్కొన్నారు. దేశ జనాభాలో కనీసం 75 శాతం మంది ఇది వర్తింప జేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ పథకం కేవలం పేదలే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఆర్థికవేత్త తెండూల్కర్ జనాభాలో 22 శాతం మంది అతి పేదలు ఉన్నారని పేర్కొంటే, మరో ఆర్థికవేత్త రంగరాజన్ 29.5 శాతం మేరకు అతి పేదలు ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల రోజువారీ కనీస ఖర్చు రూ. 27.2 అనీ, పట్టణ ప్రాంతాల్లో పేదల రోజువారీ కనీస ఖర్చు రూ. 33.3 అని తెండూల్కర్ పేర్కొనగా, మరో ఆర్థిక వేత్త రంగరాజన్ గ్రామీణ ప్రాంతాల్లో పేదల కనీస ఖర్చు రూ. 32 అనీ, పట్టణ ప్రాంతాల్లో పేదల రోజీవారీ కనీస ఖర్చు రూ. 47 అనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పేదల రోజువారీ కనీస ఖర్చు రూ. 50 లెక్కన వేసుకుని పేదలకు అందించాల్సిన కనీస ఆర్థిక సహాయం నిర్ణయించవలసి ఉంటుంది.
ఒకప్పుడు సోషలిస్ట్ దేశాల్లో ఉచితంగా బ్రెడ్ లు, బన్ లు అందజేసేవారు. ఆ కారణంగా ఆ దేశాల్లో ఆకలి చావులు ఉండేవి కావు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా, పేదలు రెండు పూటలా కడుపునిండా తిండి తినేందుకు ఢోకా లేని పరిస్థితి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశంలో ప్రతి పేదవాడికీ, మౌలిక ఆదాయం కల్పించే ప్రతిపాదన చేయడం హర్షించదగ్గ పరిణామమే. గత 70 ఏళ్లలో కమ్యూనిస్ట్ దేశమైన చైనా పలు పథకాలను కచ్చితంగా అమలు చేసి దారిద్ర్య రేఖకు దిగువన గల దాదాపు 50 కోట్ల మంది ప్రజలను ఉద్ధరించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో సర్వేలు, అథ్యయనాలు జరిపించి, తగిన ఆర్థికవనరుల సేకరణ పై దృష్టి పెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తే.. దేశంలో పేదలకు కనీస ఆదాయం కల్పన సాధ్యమే. మౌలిక ఆదాయం కల్పించే ఈ పధకం దేశంలోని పేదరికాన్ని తుడిచిపెట్టే మహత్తర పధకం అవుతుందా అన్నది చూడాలి.
(మల్యాల పళ్ళంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ 9705347795)