దేశంలో ఓట్ చోరీ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ చెప్పిన ఆయన తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఓట్ల దొంగతనంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మరోసారి ఆరోపించారు. త్వరలోనే ఆ పార్టీని గద్దె నుంచి దింపుతామని హెచ్చరించారు.
ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాగ్ చేస్తున్నారని పరోక్షంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో వివిధ ఫోన్ నెంబర్ల ద్వారా అక్రమంగా ఓట్లను తొలగించారని పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే దేశంలో లక్షలాది ఓట్లను తొలగించారని.. ముఖ్యంగా ఆదివాసీలు, మైనార్టీల ఓట్లనే ఎక్కువగా తొలగిస్తున్నారని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాగే ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. అక్కడ ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లు అన్ని తప్పుడు నెంబర్లు అని చెప్పారు. ఫేక్ లాగిన్ ఐడీలతో ఓట్లను తొలగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లోనే ఓట్లు తొలగింపు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నామని వెల్లడించారు.
మహారాష్ట్రలోని రాజూర అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్ల జోడింపు అంశంపై ఈసీని ప్రశ్నించారు. తమకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపుపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని గుర్తుచేశారు. విచారణ సందర్భంగా 18 నెలల్లో 18 లేఖలు సీఐడీ రాసిందన్నారు. ఓటరు ఓటు కోసం ఎక్కడి నుంచి దరఖాస్తు చేశారో ఐపీ నెంబర్లు.. ఏ ప్రాంతం నుంచి ఆపరేట్ చేశారనే వివరాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసిందన్నారు. కానీ ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా ఈసీ స్పందించి వారంలోా వివరాలను తమకు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ఓట్ల దొంగలను ఈసీ రక్షిస్తోందని ఆరోపించారు.
