అన్‌లాక్‌ 3.0 : థియేట‌ర్స్‌కు మాత్రం లాక్ వేయాల్సిందే..!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా లాక్‌డౌన్‌కు సంబంధించి.. అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్‌లాక్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అన్‌లాక్‌లో ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు, జిమ్‌లు, యోగా సెంట‌ర్లు ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ల‌భించింది.

అయితే కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో మాత్రం ఆగస్టు 31వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్షలు యధాతథంగా కొన‌సాగుతాయి. అలాగే మెట్రోరైళ్లకు, సినిమా హాళ్లకు, బార్లకు అనుమతి ల‌భించ‌లేదు. అంతే కాకుండా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. మ‌రోసారి సినిమా హాళ్ళు ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఆగ‌స్టు ఒక‌టి నుంచి సినిమా థియేట‌ర్లు ఓపెన్ అవుతాయ‌నే ప్ర‌చారం జ‌రిగినా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

ఇక‌ పార్కులు,స్విమ్మింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియాల పై కూడా నిషేధం య‌ధావిధిగా కొనసాగనుంది. అలాగే సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపైన నిషేధం కొనసాగుతుంద‌ని, రాష్ట్రాల్లో అంత‌ర్ రాష్ట్ర‌ రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని, దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవ వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు.