కరోనా మొదటి వేవ్ తరుణంలో కేరళ సర్కార్ కట్టు దిట్టమైన చర్యలతో మహమ్మారి విజృంభణను అడ్డుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రసంశించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మొదటి వేవ్ ని ధీటుగా ఎదుర్కొన్న కేరళ ప్రభుత్వం సెకండ్ వేవ్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. దేశం అంతటా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతుంటే రాష్ట్రంలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకి 20 వేలకు పైచిలుకుగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేరళలో జులై 31, ఆగస్టు 1 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా కేరళలో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ సర్కారు లాక్‌డౌన్ విధించాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంది. కేరళలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల వైద్య బృందం ఆ రాష్ట్రానికి త్వరలోనే చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్షల విధింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.