సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
అవును… తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. కార్మికులకు ఇవ్వాల్సిన ఈఎస్ఐ డబ్బులు ఎగ్గొట్టడమే దీనికి కరణం అని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే… చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ ను నడిపించారు. ఈ సినిమా థియేటర్ లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదట. దీంతో… కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది.
దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అదేవిధంగా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.
కాగా… జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో నటించిన జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరపున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాలతో సమాజ్ వాదీ పార్టీలో చేరారు.
అనంతరం 2004 నుండి 2014 వరకు, ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా కూడా పని చేసి 2019లో బిజెపిలో చేరారు. అలా ఒకపక్క సినిమా రంగం, మరోపక్క రాజకీయ రంగంలోనూ జెండా ఎగురవేస్తున్న జయప్రదకు తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది!