KTR: జనతా గ్యారేజ్ లా మారిన తెలంగాణ భవన్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర భవనం కాస్త జనతా గ్యారేజ్ లాగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతిభ స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరించి.. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ర్యాలీ ఎవరూ చూడకుండా లైట్లు సైతం బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ చరిత్ర ఏంటి.. తెలంగాణ ఉద్యమం గురించి భావితరాలకు తప్పనిసరిగా తెలియాలని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుంచి సమైక్య పాలకుల వరకు తెలంగాణ వారిని చాలా అల్పులుగా చూశారు.

ప్రత్యేక తెలంగాణ ఇస్తే పాలించడం వారికి చేతకాదని హేళన చేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కూడా జరుగుతాయని తెలిపారు. అయితే వీటన్నింటినీ లెక్క చేయకుండా కేసీఆర్ ప్రాణ తాగ్యానికి కూడా సిద్ధమయ్యి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

1956లో ఆంధ్రా, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ బలవంతపు పెళ్లి చేసిందని తెలిపారు. కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని ప్రధాన మంత్రి హోదాలో జవహర్ లాల్ నెహ్రూ అన్నారన్నారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని సైతం తుంగలో తొక్కారని కేటీఆర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. పదవుల త్యాగంతోనే కెసిఆర్ పార్టీని స్థాపించారని ఈయన గుర్తు చేశారు.

కేసీఆర్ పదవి నుంచి దిగి పోగానే శత్రువులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి కించ పరుస్తున్నారని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టుగా మోడీ కూడా వ్యవహరించాలని ఈయన గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ, బీజేపీలతో తెలంగాణకు ఎంతో ప్రమాదం పొంచి ఉంది తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలన గురించి కేటీఆర్ మండిపడ్డారు.