బాధితురాలి అభ్యంతరం, విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల వ్యవహారం సుప్రీంకోర్టులో చిత్రవిచిత్రమయిన మలుపులు తిరుగుతూ ఉంది. ఈ వేధింపుల ఆరోపణల మీద సంస్థాగత (in-house)విచారణ జరిపేందుకు నియమించిన జస్టిస్ ఎస్ ఎ బాబ్ది కమిటీ నుంచి జస్టిస్ నూతల పాటి వెంకటరమణ తప్పుకున్నారు. బాధితురాలు ఆయన మీద ఆవిశ్వాసం వ్యక్తం చేయడంతో జస్టిస్ రమణ ప్యానెల్ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఈ ప్యానెల్ లో రమణ తో పాటు ఒక మహిళా జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడా సభ్యురాలు గా అన్నారు.

శుక్రవారం నాడు కమిటీ ముందుకు రావలసిందిగా బాధితురాలిని జస్టిస్ బాబ్డి ఆదేశించారు.
అయితే జస్టిస్ రమణ కమిటీలో ఉండటం మీద సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె కమిటీకి లేఖ రాశారు. జస్టిస్ బాబ్డికి రాసిన లేఖలో కమిటీలో కేవలం ఒక మహిళా న్యాయమూర్తే సభ్యురాలుగా ఉండటం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

కార్యాలయాలలో లైంగిక వేధింపుల ఆరోపణల మీద విచారణ చేస్తున్న కమిటీలో, విశాఖ తీర్పు ప్రకారం,మెజారిటీ మహిళా సభ్యలుండాలని, దీనికి భిన్నంగా ఈ కమిటీలకేవలం ఒక్కరే మహిళ ఉన్నారని, దానికి తోడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాగా సన్నిహితుడయిన జస్టిస్ రమణ సభ్యుడిగా ఉండటం సరికాదని ఆమె పేర్కొన్నారు.

‘ జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి కి చాలా సన్నిహితుడు. అంతేకాదు, ఆయన ప్రధాన న్యాయమూర్తి ఇంటి సభ్యుడిలా మెలగుతుంటారు. నన్ను ప్రధాన న్యాయమూర్తి క్యాంపు కార్యాలయంలో నియమించినప్పటినుంచి నేనీ విషయాన్ని గమనిస్తూ వస్తున్నానని వినయపూర్వకంగా విన్నించుకుంటున్నాను,’అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

“Justice Ramana is a frequent visitor to the residence of the CJI. Because of this I fear that my affidavit and evidence will not receive an objective and fair hearing,” అని బాధితురాలు తన లేఖలో పేర్కొన్నారు.

ఇదే విధంగా, తన ఫిర్యాదు చేసిన మరసటి రోజు ధర్మాసనానికి అధ్యక్షత వహిస్తూ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆమె అభ్యంతరం తెలిపారు.

జస్టిస్ ఎకె పట్నాయక్ విచారణ

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ చేసిన ఆరోపణలు మీద విచారణకు ఆదేశించారు . ప్రధాని న్యాయమూర్తిని తప్పించేందుకు ఓక కుట్రజరుగుతూ ఉందని, ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఈ కుట్రలో భాగమని చెబుతూ ఆయన కొంతమంది ప్రముఖల పేర్లతో పాటు మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పేరును కూడా ప్రస్తావించారు. బైన్స్ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఈ విషయం దేశవ్యాపితంగా సంచలనం సృష్టించింది. అందుకే సుప్రీం కోర్టు తనకు తానుగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించింది.

తన దగ్గిర ఉన్న సమాచారాన్ని ఒక అఫిడవిట్ రూపంలో కోర్టు కు సమర్పించాలని కూడా కూడా లైంగిక వేధింపుల వ్యవహారాన్ని విచారిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ ఆదేశించింది. ఈ అఫిడవిట్ లను పరిశీలించాక న్యాయవ్యవస్థ స్వతంత్రప్రతిపత్తికి, ముఖ్యంగా సుప్రీంకోర్టు గౌరవానికి భంగం కలగకుండాచూసేందుకు  ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరగాలని కోర్టు భావించింది. దీని మీద ఏక సభ్య విచారణ కోసం కోసం రిటైర్డ్ జడ్జి ఏకె పట్నాయక్ నియమించింది. ఈ విచారణ లైంగిక వేధింపు వ్యవహారాన్ని కాకుండా కుట్రకోణాన్ని మాత్రమే పరిశీలిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆయనకు సీబీఐ డైరెక్టర్, ఐబీ ఛీప్, ఢిల్లీ పోలీసులు సహకారం అందించాలని ఆదేశించింది.
న్యాయ వ్యవస్థను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇది మూడో విచారణ. ఒకటి జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ చేస్తున్న విచారణ, రెండోది, జస్టిస్ ఎస్ ఎ బాబ్డి చేస్తున్న విచారణం, మూడోది జస్టిస్ ఎకె పట్నాయక్ విచారణ. విచారణ అనంతరం జస్టిస్ పట్నాయక్ కోర్టుకు ఒక సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పిస్తారు.