జగన్ కు షాక్ ఇచ్చిన న్యాయవాదులు, డైరెక్ట్ సీఎం కుర్చికే గురి పెట్టారు!!

ఏపీలో ఉన్నంత హాట్ గా రాజకీయాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. రాష్ట్రంలో ఇంకా మూడు రాజధానుల గొడవ సద్దుమనగక ముందే మరో వివాదం మొదలైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పక్షాల నుండి, ప్రజల నుండి కంటే కూడా ఎక్కువ వ్యతిరేకత కోర్ట్ ల నుండి ఎదురుకున్నారు. దాదాపు 100పైగా సందర్భాలలో కోర్టులు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు న్యాయమూర్తులపై పోరాటం చేస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జస్టిస్‌ ఎన్వీ రమణపై, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి ఫిర్యాదు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాసిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుపైనా, పలువురు ఇతర న్యాయమూర్తులపైనా వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కోర్ట్ నిర్ణయాలపై, కోర్ట్ లపై, న్యాయవాదులపై, న్యాయమూర్తులపై సుప్రీం కోర్ట్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు కానీ ఆ లేఖను ఇలా బహిర్గతం చేయడంపై ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ అత్యంత సమర్థమైన, నిజాయితీగల న్యాయమూర్తి అనీ, ఆయనకు దురుద్దేశ్యాలు ఆపాదించడం తగదని ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

అలాగే వైఎస్‌ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ న్యాయవాదులు జిఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ రమణపై సీఎం జగన్‌ ఆరోపణలు సరికావనీ, ఇవి దురుద్దేశ్యంతో చేసిన ఆరోపణలనీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి లేఖ రాయడం తప్పు కాకపోవచ్చనీ, అయితే, దాన్ని బహిర్గతం చేయడం మాత్రం తప్పేనని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, ఈ పరిణామాలతో ఇప్పటికిప్పుడు వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుందని అనుకోలేం. వైఎస్‌ జగన్‌ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ స్పందించాల్సి వుంది. ఈ పిటిషన్ లపై సుప్రీం కోర్ట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.