నిప్పులు చెరిగే ఎండలో.. ఎముకలు కొరికే చలిలో నిన్నూ నన్నూ కాచేది.. దేశాన్ని కాపాడేది.. ఎవడురా.. వాడు భారత సైనికుడు..!
బుల్లెట్టు తగిలినా బల్లెట్టులా దూసుకు వెళ్లి శత్రు శిబిరంలో దడ పుట్టించేది ఎవడురా.. వాడు భారత సైనికుడు..!
నా ఉద్యోగం.. నా సద్యోగం.. నా యోగం.. నా యాగం.. ఇది నా యుగం.. అని గర్వంగా చెప్పుకునేది ఎవడురా.. వాడు భారత సైనికుడు..!
యుద్ధభూమి మరుభూమి.. ఏదైనా ఒకటేరా.. నా దేశం కోసం అసువులు బాసినప్పుడు.. చివరి శ్వాస వరకు అదే పోరాటం.. మాతృ భూమి రక్షణ కోసమే ఆరాటం.. ఇలా తెగింపుగా చాటే వీరుడు ఎవడురా.. వాడు భారత సైనికుడు..!
మరణంలోనూ మోముపై చెరగని నవ్వు.. చెదరని రోషం.. బుసలు కొట్టే పౌరుషం.. చేతిలో గన్ను..చూపని వెన్ను ఇవన్నీ చాటేది ఎవడురా.. వాడు భారత సైనికుడు..!
ఇప్పుడు కన్ను మూసినా మళ్లీ ఇలాగే పుట్టాలని.. మరోసారి ఇదే రీతిన చనిపోవాలని.. నరనరానా కోరుకునే వాడు ఎవడురా.. వాడు భారత సైనికుడు..!