నేనెరిగిన గాంధీజీ…

 

 

(కురాడి చంద్రశేఖర కల్కూర) 

అక్టోబర్ 2, గాంధీ జయంతి స్పెషల్.

మరీ కురూపి కాకపోయినా, అంత  ఆకర్షణియమైన వాడు మాత్రం కాదు; గొప్పశారీరక శక్తి సామర్థ్యాలున్నవాడుగాదు; బహుముఖ ప్రజ్నాశాలియా, కాదు. అద్వితీయ వక్తయా, అదీ కాదు.  గొప్ప మేధావీ కాదు; వృత్తి పరంగా వకాలతు లేని ఒక బ్యారిస్టర్; తన రాత తనే చదువలేడు; ఒక రకంగా చెప్పాలంటీ, మానవీయ దౌర్బల్యాలు గలిగి, చెడు  స్నేహితుల ఒత్తడికి లోనై, వెశ్యాగృహములో అడుగు పెట్టి, మాంసాహారం సేవించిన వాడు. ఒక విధంగా బాగా పిరికి. మానసిక బలహీనతలకు గురియై చాపలొ మూత్ర విసర్జన చేసుకొన్నభయస్తుడు కూడా. ఇకా ఎన్నెన్నో లోపదోషాలున్న వ్యక్తి మోహనదాస్ కరం చంద్ గాంధి. ఇంతటి సామాన్య మనిషి, అసామాన్య మనీషిగా ఎలాఎదిగాడు?  బాపు, గాంధీజీ, మహాత్మా గాంధీ, జాతి పిత ఎలా అయ్యాడు?

 

20 వ శతాబ్దం పూర్వార్ధంలో ఆయనతో ప్రభావితం కాని ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక వృత్తి, ఒక ఊరు, ఒక గేరి, భారత దేశములో లేదంటె అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఐన్ స్టిన్ తరువాత అంత మన్నన పోందిన ధీమంతుడు.   20 వ శతాబ్దం గాంధీజీ దే  అని ఎలా అనుపించు కొగలిగాడు. అంతటి ఐన్ స్టిన్: ” రక్త మాంసాలతో ఇలాంటి వ్యక్తి  మన మధ్య నడెయాడాడంటె వచ్చె తరం నమ్మలేదేమో ? అన్నాడంటె ఆయన ఔన్యత్యం ఎంతటిది? వచ్చేతరాలకు కూడా మార్గదర్శకుడిగా ఎలా ఉండగలుగుతున్నాడు? అమెరికా వంటి సర్వతో సంపన్న దేశాలప్రజలు తమ  అత్యంత ప్రియ నాయకులైనటువంటి, జార్జ్ వాషింగ్ టన్, థొమస్ జఫర్సన్, అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెన్నడి, మార్టిన్ లూథర కింగ్, వంటి వాళ్ళ సరసున ఈ వ్యక్తిని ఎందుకు గౌరవిస్తారు? 

 

       రెండు తెల్ల బట్టలు, ఒక చేతి కర్ర, ఒక రాట్న, ఒక జత చప్పులు, ఒక కళ్లద్దాలు వంటి నిత్యావసర వస్తువులు తప్ప తనదంటూ ఈ ప్రపంచములొ ఏ స్థిర, చరాస్థి లేని 50 కేజీలు మించని (100 పౌండ్ళు) బరువు గల ఒక అర నగ్న వ్యక్తి;  “ప్రమాద కరమైన చర్యలతొ, చూడడానికి అసహ్యకరమైన, శరీరంగల్గిన ఈ వ్యక్తి, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ప్రతినిధితో సమానముగా ప్రాతినిధ్యం వహించడమా?” అనిపించుకొని, ఆ సామ్రాజ్యాన్నే, గడగడలాడిచ్చినాడంటె ఆయనలోని గొప్పేంటి?

     ఉజ్జయిని చక్రవర్తి, విక్రమాదిత్య అష్టలక్ష్మి సంపన్నుడు. ఆయన అవనతి ప్రారంభంలో, ఏడుగరు లక్ష్మిలు దూరమౌతున్నా పెదవులు తెరవని చక్రవర్తి, ధైర్య లక్ష్మి బయలు దేరగానే, నిన్ను నేను వదలి పెట్టను: “ధైర్యూ సాహసే లక్ష్మి” నీవుంటె అన్ని సాధిస్తాను అన్నాడు. గాంధీజీ దగ్గర ఉన్నది అది ఒక్కటే! వేశ్యాగృహములొ అడుగు పెట్టినా, మాంసాహారం సేవించినా, చాపలొ మూత్ర విసర్జన చేసుకొన్నా ఆ తప్పులను ఒప్పుకొన్నధీశాలి. ఇంటి పనిమనిషి రామ నామ స్మరణతొ ఆ దుర్బుద్ధి, మానసిక రోగాలు నయమవుతాయంటె, దానిని పాటించి, తప్పులను సవరించుకొన్నస్వయం సంస్కర్త. మార్పుకు కారణ భూతులైన వారికి కృతజ్ఞతలు తెలియజేసిన నయవినయాల, ఫల భార నమ్రతల సాక్షాత్కారం. ’భారత దేశములో బ్రిటిష్ నిరంకుశత్వాన్ని నిరసించడానికి, సత్యాగ్రహ మార్గాన్ని విడనాడను’ అంటూ చక్రవర్తి ముందు, బక్కింఘామ్ రాజ ప్రాసాదములొ,  ఏకాకిగా కూర్చొని నిస్సందేహం, నిస్సంకోచాలతొ, తెల్చి చెప్పే టంత గుండె ధైర్యం ఆ ఒక్కడికే గల్గింది.        

          ఇంకొక గొప్ప లక్షణం: ఎంతటి చిన్న విషయమైనా, ఎంతటివారినుండియైనా, తన దృష్టికి వచ్చినప్పుడు దానికి సకారాత్మకమైన స్పందన. తాను చెయ్యలేనిదానిని, తెలియని విషయాలను, నేర్చుకొని,  తెలుసుకొని, ఆచరణయోగ్యమని దృవీకరించిన తరువాతనే, ఉపదేశించిన మహాపురుషుడు. అందుకే తన విమర్శకులైన రవీంద్రనాథ ఠాగోర్ గారితొ, ’మహాత్మా’ అనిపించికుని, ఇంకొక ప్రత్యర్థి నేతాజి సుభాస్ చంద్ర బోస్ తో “జాతి పిత” అనిపించుకొన్నాడు. దేశీయ వాదాన్ని, తీవ్రంగా ప్రతిఘటించిన దివాన్ విశ్వేశ్వరయ్య గారికి, భారీ పరిశ్రమమువల్ల నిరుద్యోగం పెరుగుతుంది అన్న  గాంధీజీ కుర్చీ వేసి కుర్చొబెట్టారు,( వైస్రాయ్ కూడా కింద కుర్చోవలసిందే). మహారాజా ముందు కూడా తీయని తల పాగా, బూట్సు, కోటు, టై, లను విశ్వేశ్వరయ్య గాంధీజీ ముందు మాత్రమే  తీసి  కూర్చొని పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు.   బస్ లో ట్రైన్ లొ తిరుగుతున్నప్పుడు, ’గుర్తు పత్రం’ (ఐడెంటిటి కార్డ్ – జనన తేది: 20-6-1940,) చూసి, టికెట్ తనికి చేసే సామాన్య ప్రభుత్వ ఉద్యొగులు “స్వామీ, మీరు గాంధిజీ  యుగమువారా; ఆయనను చూశారా?” అంటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. (నేను చూడలేదు).30-1-1948 న కర్ణాటకలోని, ఉడుపికి, 30 కి.మీ. దూరమున్న తంత్రాడి హెమ్లెట్, మందర్తి అనే పల్లెలొ, నా మేనత్త మనుమరాలి  పెండ్లిలో  ఉన్నాను. అక్కడికి గాందీజీ మరణ వార్త 31 ఉదయం చేరింది. అందరూ చాందసవాదులె. కొందరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాదులు కూడా ఉన్నారు. ముక్త కంఠంతో  “అదృష్టానికి పెండ్లి ఆయి పొయింది. లేక పోతె, దేశానికెే సూతకం ఉన్నప్పుడు శుభ కార్యం తగదుగదా?” అనుకొన్నారు.

అందరూ దగ్గరలొని వాగులొ స్నానం చెసుకొన్నారు. ఆ దంపతులు, సరస్వతి, లక్ష్మీ నారాయణ భట్ట తమ జీవన సంధ్యలొ, కుమారుడు, డా.శ్రీపతి భట్టదగ్గర, కర్ణాటకలోని, మంగళూరు దగ్గర పుత్తూరు పట్టణములొ నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తముగా వివిధ భాషలలొ 43 వేలకు పైగా పుస్తకాలు గాంధీజీ  పేరుతో ఉన్నవీ, ఆయన రాసినవి కలిపి ముద్రించి ప్రకటన జరిగింది. బైబిల్ తరువాత ఇన్ని భాషలలొ ప్రచురణ ఉండటం “గాంధీ సాహిత్యమే”. ఈ నాటికీ కనీసం రోజు కొక పుస్తకం ప్రపంచం ఏదో ఒక మూలలొ, ఏదో ఒక భాషలొ, కొత్త కోణముతొ,  ప్రచురణఅవుతూ ఉంటుంది. ‘గాంధీగారి  ఇంగ్లీష్’ (Gandhina English) ను సృష్టించినా దేశీయ భాషల కోసం నిరంతరం  పొరాడారు.

       ఇంతటి మహోద్దండ మూర్తి మరణాన్ని నెహ్రూగారు:  ‘THE LIGHT IS OUT’ (దీపం ఆరి పోయింది/ వెలుగు తొలగింది) అనడం  అతిశయోక్తి కాదు. గాంధీజీ నిధన దుర్వార్త విన్నప్పుడు ప్రపంచమటా ఏడిస్తె, మహమ్మద్ రఫి: “సునో! సునో! దునియావాలే లోగ్; బాపూజికె అమర్ కహాని” అని పాడినప్పుడు, ప్రపంచమంతా కన్నీళ్ళు కారిస్తే ఆశ్చర్యం కాదు.

 జై హింద్.

 

(కురాడి చంద్రశేఖర కల్కూర గురించి ఎంతరాసినా ఇంకా చెప్పాల్సింది మిగిలే ఉంటుంది. రాయలసీమలో  తొలినాళ్ల ఉడుపి హోటళ్ల స్థాపకుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ హోటెల్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.  తెలుగు కన్నడ పండితుడు. చదువరి. తెలుగు భాషాభివృద్ధి కోసం నిరంతర శ్రమిస్తుంటారు. జ్జాన పీఠ్ అవార్డు గ్రహీత శివరామ కారంత్ కు  స్నేహితుడు…ఇంకా ఎన్నెన్నో )