ప్రపంచంలోనే పెద్దదైన కోవిడ్ హాస్పిటల్.. భారత్  అనుకుంటే ఏదైనా సాధ్యమే 

ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా కరోనా దాటికి విలవిలాడి పోతోంది.  ఇప్పటికే దేశంలో 6.9 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  ఈ వైరస్ కారణంగా 19,683 మంది మరణించారు.  ప్రతిరోజూ వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి.  దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సీన్ వచ్చే వరకు నియంత్రణే మార్గం కాబట్టి వైద్య సదుపాయాలను గణనీయంగా పెంచాలని భావించింది.  అందుకే భారీ సంఖ్యలో పడకలతో కోవిడ్ ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించారు.  అందుకు ఢిల్లీని వేదికగా చేశారు. 
 
దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌లో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు.  కేవలం 10 రోజుల్లో 10,000 పడకలతో ఆసుపత్రిని నిర్మించారు.  చైనాలోని వూహాన్లో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించగా ఇండియా అదే సమయంలో 10వేల పడకల హాస్పిటల్ రూపొందించి రికార్డ్ సృష్టించింది.  దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని నామకరణం చేశారు. ఇందులో ఐసోలేషన్‌, చికిత్స సదుపాయాలు ఉంటాయి.  ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం దీన్ని ప్రారంభించారు.  
 
ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ అవిశ్రాంతంగా శ్రమించి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.  ఇందులో 600 మరుగుదొడ్లు, 70 పొర్టబుల్ టాయిలెట్లు ఉంటాయి.  దీని పారిశుద్య బాద్యతలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుంది.  ఈ ఆసుపత్రి నిర్మాణంతో భారత్ కోవిడ్ మీద సమర్థవంతంగా పోరాడే సత్తా కలిగి ఉందని నిరూపితమైంది.  అనుకుంటే ఇలాంటి ఆసుపత్రులను రానున్న రోజుల్లో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసి వైరస్ బారినపడిన వారికి మెరుగైన చికిత్స అందించగలమని ప్రభుత్వం ఈ ఆసుపత్రి నిర్మాణంతో నిరూపించుకుంది.