ఢిల్లీలో దొంగ – పోలీస్ ఆట… లోకేష్ పిల్ల చేష్టలు?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ ను ఏ-14గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కు వెళ్లారు. అయితే అందుకు అంగీకరించని న్యాయస్థానం… 41-ఏ నోటీసులు ఇచ్చి లోకేష్ ను విచారించాలని సూచించింది. పనిలోపనిగా సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.

అయితే… 41-ఏ నోటీసులు ఇద్దామని ప్రయత్నిస్తున్న సీఐడీ అధికారులకు దొరకకుండా లోకేష్ తప్పించుకు తిరుగుతున్నాడని అంటున్నారు. ఢిల్లీలో లోకేష్ ఉన్నాడని సమాచారం ఉన్న ప్రతిచోటా సీఐడీ అధికారులు వెతుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 15 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన లోకేష్ కొద్దిరోజులు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ క్వార్టర్స్ లో ఉన్నారట. తర్వాత అక్కడి నుండి ఒక హోటల్‌కు మారిపోయారట.

ఈ క్రమంలో మూడురోజుల క్రితం అక్కడి నుండి కూడా మారిపోయినట్లు తెలుస్తుంది. మరోపక్క జయదేవ్ ఆఫీసు గెస్ట్ హౌస్‌ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ కూడా లేరని అంటున్నారు. ఈ సమయంలో సినిమాల్లో దేశం దాటిపోయే విలన్లు ప్రవర్తించినట్లుగా… అకామిడేషనే కాదు వాహనాలను కూడా రెగ్యులర్‌ గా మారుస్తున్నారట లోకేష్!

ఏది ఏమైనా… సీఐడీ అధికారులకు దొరక్కుండా తిరగటం అన్నది లోకేష్‌ కు నష్టమే చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. సీఐడీ అధికారుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా లోకేష్ నోటీసులు తీసుకోకపోతే జరిగే పరిణామాల గురించి తక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారని చెబుతున్నారు. ఇదే క్రమంలో నోటీసులు అందుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి అరెస్టుకు అనుమతి ఇవ్వమని సీఐడీ అధికారులు అడిగే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.

మరి ఈ విషయాలను లోకేష్ కు తన లాయర్లు చెబుతున్నారో లేదో తెలియదు కానీ… నోటీసులు తీసుకోకపోయినా, విచారణకు సహకరించకపోయినా కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని.. ఫలితంగా గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు అవుతుందని అంటున్నారూ పరిశీలకులు.

మరోపక్క “అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కాంలో ఏ-14గా ఉన్న నారా లోకేష్.. అరెస్ట్ భయంతో ఢిల్లీకి పారిపోయాడు. దాంతో అతనికి 41-ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు వెళ్లగా.. వారికి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్నాడు. తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు లోకేష్” అంటూ వైసీపీ ట్విట్టర్ వేదికగా టార్చర్ పెడుతుంది!!