ఎవరి ముఖస్తుతి కోసం ఈ చీకటి ప్రయాణం?

స్కిల్ డెవలప్ మెంట్స్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టైన తర్వాత ఢిల్లీ వెళ్లిపోయిన లోకేష్ ప‌ది రోజులుగా ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. అక్కడేం చేస్తున్నారంటే… జగన్ దెబ్బకు భయపడి వెళ్లి అక్కడ దాక్కున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే పలువురు జాతీయ నాయకులను కలవడానికి ప్రయత్నిస్తున్న నారా లోకేష్… తాజాగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూతో భేటీ అయ్యారు. తమపై రాజకీయ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తాను ఢిల్లీలో దాక్కుంటే వచ్చి అరెస్ట్ చేసే ధమ్ము లేని కేసులు తనపై పెట్టారని విమర్శించారు.

అయితే లోకేష్ వెయిటింగ్ అంతా కేంద్ర హోమంత్రి అమిత్ షా గురించి అని అంటున్నారు పరిశీలకులు. గత వారం రోజులుగా అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం నారా లోకేష్ చెయ్యని ప్రయత్నం లేదని అంటున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం నారా లోకేష్ ని కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇక ఢిల్లీలో ఉండతం కంటే ఏపీకే వచ్చేయాలని తాజాగా లోకేష్ భావించారంట.

ఇందులో భాగంగా ఈ నెల 29న లోకేష్ తిరిగి యువగళం పాద‌యాత్ర ప్రారంభిస్తార‌ని తెలుగుదేశం ప్రక‌టించింది. దీంతో టీడీపీ కేడర్ కాస్త యాక్టివేట్ అయ్యిందని అంటున్నారు. ఇన్ని రోజులు బాబు లోపల, లోకేష్ హస్తినలో, బాలయ్య షూటింగులో, పవన్ అజ్ఞాతంలో ఉండేసరికి మరీ స్థబ్ధగా మారిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు.

సరే చినబాబు రోడ్లపైకి వస్తే కేడర్ లో కొత్త ఉత్సాహం వస్తుంది.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏర్పాటు చేసిన దీక్ష స్థలాలను సందర్శించుకుంటూ చినబాబు పాదయాత్ర చేస్తారు అని అంతా భావించారు! అయితే కార్యకర్తలు ఒకటి తలిస్తే, చినబాబు మరొకటి తలచారు. ఇందులో భాగంగా… రాత్రి పూటా మొదలుపెడుతున్నారు.

అవును… కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని పొదలాడ నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించాలని చినబాబు ఫిక్సయ్యారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… 29న శుక్రవారం రాత్రి 8.15 గంట‌ల‌కు పాద‌యాత్ర పునఃప్రారంభిస్తార‌ని తేల్చి చెప్పారు. దీంతో… రాత్రుళ్లు పాదయాత్ర ఏమిటో అని అంటున్నారు కార్యకర్తలు.

ఇలా పాద‌యాత్రను ప‌గ‌టి పూట ప్రారంభించకుండా.. రాత్రి నిద్రకు ఉప‌క్రమించే స‌మ‌యంలో చేపట్టడం ఏమిటని… ఇదేదో ఈవినింగ్ వాకింగ్ లా ప్లాన్ చేస్తున్నట్లున్నారని.. ఆ స‌మ‌యంలో ప్రారంభించి అర్దహ్రాత్రి వరకూ తిరుగుతారా.. లేక, తెల్లారుజాము వరకూ నడిచి, అనంతరం జనం రోడ్లపైకి వచ్చే సమయానికి ఆపేస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు.

దీంతో ఇది నిజంగా ప్రజాసమస్యలను తెలుసు కోవడానికో, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికో చేస్తున్న పాదయాత్ర కాదు… తీరా మొదలుపెట్టాం కాబట్టి అన్నట్లుగా మొక్కుబడిగా, ముఖస్తుతి కోసం చేస్తున్న ఈవినింగ్ వాక్ లా ఉందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. రాత్రి పూట పాదయాత్ర మొదలు పెట్టాలని భావించిన లోకేష్ ఆలోచనా విధానం న భూతో న భవిష్యత్ అని కామెంట్ చేస్తున్నారు.