ఢిల్లీ టైమ్స్: వైసీపీతో బీజేపీ సంప్రదింపులు.?

తమకు ఏడెనిమిది ఎంపీ సీట్లను ఇస్తే, వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు పంపుతోందిట. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ముఖ్య నేతల బృందం, బీజేపీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతోందంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదేంటీ, జనసేనతో బీజేపీ టచ్‌లో వుంది కదా.? రెండు పార్టీల మధ్యా స్నేహం వుంది కదా.? అంటే, అది అదే.. ఇది ఇదే.! వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేనతో కలిసి వెళ్ళాలని బీజేపీ అనుకోవడంలేదు. జనసేన – బీజేపీ మధ్యనే పొత్తు వుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కానీ, ఈ మధ్య బీజేపీని పూర్తిగా లైట్ తీసుకున్నారు జనసేనాని. ‘సైకిల్ – గ్లాస్’ జెండాలు మాత్రమే, జనానికి కలిసి కనిపిస్తున్నాయి. దాంతో, ఏపీ కమలనాథులు ఒకింత గుస్సా అవుతున్నారు. తమ పరిస్థితేంటన్నదానిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వరిపై ఏపీ బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు కూడా.

వాస్తవానికి పురంధీశ్వరి కూడా బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనలు వేరేలా వున్నాయి. టీడీపీ – జనసేన కలిస్తే, బీజేపీని లైట్ తీసుకుంటాయని ఢిల్లీ కమలనాథులకి బాగా తెలుసు.

పైగా, చంద్రబాబు అరెస్టు తమ పాపమేనని బీజేపీ నేతల్లోనే కొందరు గట్టిగా నమ్ముతున్నారాయె. ‘అబ్బే, మాకేం సంబంధం లేదు’ అని బీజేపీ చెబుతున్నా, టీడీపీ నమ్మే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీని బీజేపీ మిత్రపక్షంగా భావిస్తే అందులో వింతేముంది.?