కథగా చెప్పొచ్చుగా? – ‘డియర్ కామ్రేడ్’ రివ్యూ!
విజయ్ దేవరకొండ సినిమా అంటే ప్రేక్షకులు ఎర్ర తివాచీ పర్చి స్వాగతం పలుకుతారు. ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్స్ తోనే విశేషంగా స్పందించి స్వాగతం పలికారు – దక్షిణాది రాష్ట్రాలు సహా ఉత్తరాదిలో కూడా. వారం ముందే టికెట్ల మీద దండయాత్ర చేశారు. విడుదల ముందు రోజే హిందీ రైట్స్ కొన్న కరణ్ జోహార్ సినిమా చూసి అదిరిపోయిందంటూ అడ్వాన్స్ రివ్యూ ఇచ్చాడు. మూవీకి కావాల్సినంత హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు భరత్ కమ్మ కూడా సెలబ్రిటీ అయిపోయాడు. పాపులర్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఆశల్ని రేపింది. కన్నడ భామ రశ్మికా మందన, విజయ్ దేవరకొండకి జోడీ కావడం క్రేజ్ తీసుకు వచ్చింది. మెలోడీగా వున్న పాటలూ ఆడియెన్స్ లోకి వెళ్ళాయి. ఇన్నిహంగులు జతపడిన ‘డియర్ కామ్రేడ్’ కి ఇక మిగిలింది టాక్ ఒక్కటే. చూడాల్సింది కంటెంట్ ఒక్కటే. కంటెంట్ ఏమిటి, దీని టాక్ ఏమిటి ఇక చూద్దాం…
కథ
కాకినాడ యూనివర్సేటీ లో బాబీ (విజయ్ దేవరకొండ) వామపక్ష భావాలున్న స్టూడెంట్ యూనియన్ లీడర్. తల్లిదండ్రులు, చెల్లెలు, తాత వుంటారు. తాత అప్పట్లో కామ్రేడ్ గా కమ్యూనిస్టు పోరాటాలు చేశాడు. బాబీ కాలేజీలో అన్యాయాల్ని సహించక దేహశుద్ధి చేస్తూంటాడు. రాజకీయంగా అతన్ని వాడుకోవాలని బయటి శక్తులు ప్రయత్నిస్తూంటాయి. ఇంతలో హైదరాబాద్ నుంచి లిల్లీ (రశ్మికా మందన) వచ్చి దిగితుంది. ఈమె క్రికెట్ స్టేట్ ప్లేయర్. ఒకసారి క్రికెట్లో బాబీ టీముకి సాయపడుతుంది. ఇక బాబీ ప్రేమించడం మొదలెడతాడు. కానీ బాబీలాగే ఆమె అన్న యూనివర్సిటీ లో గొడవలు పెట్టుకుని చనిపోయాడు కాబట్టి గొడవలంటే తనకిష్టం లేదంటుంది. ఇది పెద్ద సమస్య కాదనీ, గొడవలు మానుకుంటాననీ అంటాడు.
కానీ రాజకీయశక్తులు గొడవల్లోకి లాగడంతో ఆ రక్తపాతం చూసి అతడికి దండం పెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో దిక్కు తోచక బాబీ తాగుడు మరుగుతాడు. తాత ఇచ్చిన సలహాతో, బాధల్ని మర్చిపోవడానికి బైక్ మీద హిమాలయాలకి ప్రయాణం కడతాడు. మూడేళ్ళ తర్వాత హిమాలయాల్లో వుండగా అతడికి అందిన కబురేమిటి, దాంతో ఏం జరిగిందనేది మిగతా కథ..
ఎలావుంది కథ
ఇది కథ అని చెప్పలేం. కమర్షియల్ సినిమాలకి వర్కౌట్ కాని గాథ అని చెప్పొచ్చు. షార్ట్ ఫిలిం మేకర్స్ తో తరచు ఇలాగే జరుగుతుంది. ఇది గాథ కావడంతో ఎక్కడా కథా లక్షణాలు కనపడవు. కనీసంగా హీరోకి కాకపోతే హీరోయిన్ కైనా ఒక లక్ష్యమంటూ వుండదు. ఏం సాధించాలనుకుంటున్నారో ఇద్దరీకీ తెలీదు. కలవడం, పడక విడిపోవడం; మళ్ళీ కలవడం, పడక విడిపోవడం ఇదే పదేపదే రిపీటవుతుంది చివరి వరకూ. కథయితే అందులో కేంద్ర బిందువుగా ఒక సమస్య వుంటుంది, దాని చుట్టూ సంఘర్షణ వుంటుంది, చివరికో పరిష్కారం వుంటుంది. కథంటే ఇంతే, చాలా సింపుల్. కథతో వచ్చే సినిమాలన్నీ ఇలాగే వుంటాయి. గాథలో కేంద్రబిందువుగా ఒక సమస్య వుండదు, దాని చుట్టూ సంఘర్షణ వుండదు, చివరికో పరిష్కారం వుండదు. వూరికే నసపెడుతూ పాత్రలూ కథనమూ దేనికో అవస్థ పడుతూంటాయి. గాథ కమర్షియల్ సినిమా సరుకు కాదు. షార్ట్ ఫిలిం గానీ, ఆర్ట్ సినిమా గానీ హాయిగా తీసుకోవచ్చు.
ప్రేమ కథని పదేపదే రిపీట్ చేస్తూ, చిట్ట చివరికి హీరోయిన్ కి క్రికెట్లో సెక్సువల్ హెరాస్ మెంట్ పాయింటు కొచ్చారు. ఇదే క్లయిమాక్స్, ఇదే ముగింపు. దీంతో ఈ మొత్తం గాథలో ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం గాకుండా పోయింది. సెక్సువల్ హెరాస్ మెంట్ గురించి సందేశం ఇవ్వబోయారు గానీ అదీ కుదరలేదు. చట్టాలు, యంత్రాంగం, మీ టూ మూవ్మెంట్స్ ఇన్ని వుండి అమ్మాయిలకి ఎవేర్ నెస్ కల్పిస్తూంటే, ఈ పరిజ్ఞానమే లేనట్టు హీరోయిన్ కంప్లెయింట్ ఇవ్వడానికి నానా నసపెట్టి, పిరికిదానిగా, ఏడ్పుల యెంకమ్మగా, నేటి తరాన్ని మోటివేట్ చేస్తూ హీరోతో కలిసి పోరాడలేని పరాజితురాలిగా మిగిలినపుడే, ఈ గాథ సామాజిక ప్రయోజనం కూడా శూన్యమైంది.
ఎవరెలా చేశారు
విజయ్ దేవరకొండ పాత్రగా చేయడానికేమీ లేదు. పాత్రకి బేసిగ్గా వుండాల్సిన గోల్ లేదు. చాలా ఆశ్చర్యపర్చే విషయం. ఒక గోల్ అంటూ లేని పాత్రనెలా ఒప్పుకున్నాడా అని. ఎప్పుడైతే ఇంటర్వెల్లో హీరోయిన్ తిరస్కరించి వెళ్ళిపోయాక, తను హిమాలయాలకి వెళ్ళిపోయాడో అప్పుడే లక్ష్యం లేకుండా సన్యాసం పుచ్చుకుంది పాత్ర. సెకండాఫ్ లో తిరిగి వచ్చి ఇంకేదో చేస్తాడు, ఇంకేదో చేస్తాడని ఆశలు పెట్టుకుంటే – ఏమీ చెయ్యడు క్లయిమాక్స్ లో అతికించిన సెక్సువల్ హెరాస్ మెంట్ గొడవలో తప్ప.
ఇక స్టూడెంట్ లీడర్ గా పోరాటాల్లో చెలరేగాడు. హార్డ్ కోర్ యాక్షన్ సీన్స్ లో ఫ్యాన్స్ కి కావాల్సినంత హుషారిక్కించాడు. స్టెప్పులేసే పాటలు లేకుండా కొంత రియలిస్టిక్ గా పోవాలనుకున్నాడు. మాంటేజ్ సాంగ్స్ తో సరిపెట్టాడు. హీరోయిన్ రస్మికతో కెమిస్ట్రీ బాగానే కుదిరినా ఆ రోమాన్స్ లో ఫన్ ఫస్టాఫ్ లో అరగంట వరకే. ఆ తర్వాత రెండున్నర గంటలు శాడ్ మెలోడ్రామాతో చంపుకు తినడమే. ఇంటి సభ్యులతో, పక్కింటి వాళ్లతో, హీరోయిన్ ఫ్యామిలీతో కరణ్ జోహార్ కోరుకునే పాత మూస సెంటిమెంట్లు పోషించి హోమ్లీ హీరో అన్పించుకున్నాడు. ఫస్టాఫ్ లో హీరోయిన్ అక్క పెళ్లి సంబరం పాట, సెకండాఫ్ లో ఫ్రెండ్ పెళ్లి సంబరం పాట వేసుకుని కరణ్ జోహార్ హిందీ రైట్స్ కోనేసేందుకు ఉద్రేకపడేలా చేశాడు. చుట్టూ తోటి స్టూడెంట్స్ ని వేసుకుని మందు పార్టీలు లాగించాడు. ఐతే ఒకటి, తాత ద్వారా సంక్రమించిన కమ్యూనిస్టు భావజాలంతో స్టూడెంట్ లీడర్ గా ప్రేమల పట్ల తన దృక్పథమేమిటో అంతు తెలియకుండా పోయింది. లక్ష్యం లేకపోతే లేకపోయింది, పాత్రకి ఓ దృక్పథమైనా ఉండాలిగా? ఇది కూడా లేకుండా పోయింది. అసలా భావజాలంలో అభ్యుదయ భావాలే ఎక్కడా కనపడవు.
ఇక హీరోయిన్ రస్మిక చూడ్డానికి అందగత్తె. సెకండాఫ్ లో పాత్ర చిత్రణే ఆమె అందచందాల్ని చెడగొట్టింది. డిప్రెషన్ తో హాస్పిటల్లో చేరిన పేషంట్ గా, ప్రేమలో ఒక మాట మీద నిలబడని ప్రేమికగా, క్రికెట్లో హెరాస్ మెంట్ ని ఎదిరించలేని ప్లేయర్ గా విషాద పాత్రని బాగా పోషించింది. కాకపోతే ప్రేక్షకులకి విషాద పాత్రలవసరం లేదు. ఇది విషాద గాథల కాలం కూడా కాదు. కానీ కరణ్ జోహార్ కి ‘కభీ ఖుషీ కభీ గమ్’ అవసరం.
సాంకేతికంగా మైత్ర్ర్ మూవీస్ విలువలతో ఉన్నతంగా వుంది. ఐతే లొకేషన్ ఎప్పుడు కాకినాడలో వుంటుందో. ఎప్పుడు హైదరాబాద్ లో వుంటుందో కన్ఫ్యూజన్. అన్నిసార్లు అటూ ఇటూ మారుతూంటాయి. హిమాలయాల పర్వత సానువుల్లో షూటింగ్ బావుంది. సౌండ్ ట్రాక్, పాటలు కూడా బావున్నాయి. రిచ్ కంటెంట్ కంటే రిచ్ ప్రొడక్షన్ ని అందించగల్గారు.
చివరికేమిటి
కొత్త దర్శకుడు ముందు కథంటే ఏమిటో తెలుసుకోలేదు. గాథని ప్రయోగించి ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేశాడు. పైగా విషయం లేని గాథని 2 గంటల 50 నిమిషాలకీ పెంచి భారం వేశాడు. ఈ గాథ ప్రేమ గురించా, క్రికెట్ గురించా, సెక్సువల్ హెరాస్ మెంట్ గురించా ఒక స్పష్టత నివ్వలేకపోయాడు. ఈ గాథ కూడా ఒకడుగు ముందు కెళ్ళిందనుకుంటే, నాల్గడుగులు వెనక్కొచ్చి గడిచిపోయిన విషయాలు ముచ్చటిస్తుంది. చివరి వరకూ ఇంతే. ఈ గాథకి కూడా పురోగమనం లేక ఎక్కడికక్కడ తిరోగమనమే! విజయ్ దేవరకొండ లాంటి యువ స్టార్ తో బిగ్ బడ్జెట్ మూవీ తీయడానికి కొత్త దర్శకుడు కంటెంట్ పరంగా సరిపోలేదు. ఎవరైనా అనుభవం గల రైటర్ ని తీసుకోవాల్సింది.
రచన – దర్శకత్వం భరత్ కమ్మ
తారాగణం : విజయ్ దేవరకొండ, రాశ్మికా మందన, రావురమేష్, శృతీ రామచంద్రన్, జయప్రకాష్ తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం : సుజిత్ సారంగ్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : యశ్ రంగినేని
విడుదల : జులై 26, 2019
2.5
―సికిందర్