పీరియాడిక్‌ కథలపై టాలీవుడ్ హీరోల మోజు !

మన టాలీవుడ్ హీరోలు కొత్తదనం పంచే క్రమంలో పీరియాడిక్‌ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కాలానికి తీసుకెళ్లి వినోదాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ తరహా పీరియాడిక్‌ కథల జోరు తెలుగులో మరింత ఊపందుకుంది. పలువురు అగ్రతారలతో పాటు కుర్రహీరోలు సైతం ఈ కథలతోనే సినీ ప్రియుల్ని మురిపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈతరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో.. వారి అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే ఆ తరహా కథలతో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆదిపురుష్‌’ చిత్రాల కోసం చరిత్ర పుటలు తిరగేశారు కథానాయకుడు ప్రభాస్‌. ఇప్పుడాయన ‘కల్కి 2898ఎ.డి’ కోసం తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని తర్వాత ఆయన చేయనున్న సినిమాల్లో హను రాఘవపూడి చిత్రం ఒకటుంది. ఇప్పుడీచిత్రం కోసం మరోసారి గతంలోకి ప్రయాణించనున్నారు ప్రభాస్‌. ఇది చారిత్రక అంశాలతో నిండిన ఫిక్షనల్‌ పీరియాడిక్‌ లవ్‌-యాక్షన్‌ డ్రామాగా ఉండనున్నట్లు హను ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన త్వరలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇదీ పీరియాడిక్‌ టచ్‌తో ఉన్న స్పోర్ట్స్‌ డ్రామాగానే ఉండనున్నట్లు సమాచారం. పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా రా, రస్టిక్‌గా ఉండనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

ఇటీవల కాలంలో నాని నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘దసరా’ ఒకటి. శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ ముందు భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడిదే కలయికలో మరో సినిమా రానుంది. ఇది నానికి 33వ చిత్రం. ఇదీ ఓ విభిన్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ కథాంశంతోనే ముస్తాబు కానుంది. దీంట్లో నాని ప్రజా నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన చేయనున్న సినిమాల్లో దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ప్రాజెక్ట్‌ ఒకటుంది. 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్‌ ఓ వీరుడిగా కనిపించనున్నారు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో వరుస విజయాలందుకుని జోరు విూదున్నారు సాయిధరమ్ తేజ్‌.

ఇప్పుడాయన రాకేశ్‌ అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రం చేసేందుకు సమాయత్త మవుతున్నారు. ఇది 1940ల నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందనున్నట్లు తెలిసింది. ఇక మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘మట్కా’ కూడా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రమే. గతేడాది ‘ఏజెంట్‌’తో చేదు ఫలితాన్ని అందుకున్నారు యువ హీరో అఖిల్‌ అక్కినేని. ఇప్పుడాయన తదుపరి సినిమాని కొత్త దర్శకుడు అనిల్‌తో పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదీ ఓ ఆసక్తికరమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగానే ముస్తాబు కానున్నట్లు తెలిసింది.

ఈనెలలోనే విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో, సుధీర్‌బాబు ‘హరోం హర’తో, రాకేశ్‌ వర్రె ‘జితేందర్‌ రెడ్డి’తో రాబోతున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న పీరియాడిక్‌ సినిమాల్లో బాలకృష్ణ చిత్రం ఒకటుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా 80ల నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతోనే తెరకెక్కుతోంది. ఇక నిఖిల్‌ నటిస్తున్న ‘స్వయంభూ’ చారిత్రక కథాంశంతో ముడిపడి ఉన్న సినిమా కాగా.. ‘ది ఇండియా హౌస్‌’ స్వాతంత్యానికి పూర్వం సాగే కథతో తెరకెక్కనుంది. శర్వానంద్‌ హీరోగా అభిలాష్‌ రెడ్డి రూపొందిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా కూడా పీరియాడిక్‌ టచ్‌ ఉన్న చిత్రమే కావడం విశేషం. ఇలా గతంలోకి తొంగిచూసేలా చిత్రాలు తెరకెక్కుతున్నాయి.