’కబీర్‌సింగ్’లో కాలేజీ డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు ఎంతో బాధగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దాదాపు ఐదేళ్ల క్రితం విడుదలైన సినిమాలో నటించిన నటుడిపై సందీప్ ఎందుకు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తంచేశారంటే.. అదిల్ హుస్సేన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ’కబీర్ సింగ్’ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన చిత్రం ఒక్కటే.. అదే ‘కబీర్ సింగ్’.
అందులో కాలేజీ డీన్‌గా వర్క్ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకేఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. దాంతో వెళ్లి చెప్పిన సీన్ యాక్ట్ చేసి వచ్చేశా. ఆ సీన్ మంచిగా అనిపించింది. సినిమా కూడా అలాగే ఉంటుందని భావించా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా? అని ఇబ్బందికరంగా ఫీలయ్యా.
స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లిన నేను మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె కనుక చూసి ఉంటే నన్ను తిట్టేది అని చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలు సందీప్ దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్ చేస్తా‘ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.