Thalapathy Vijay: తమిళ నటుడు స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీని స్థాపించారు. ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. తన పార్టీ రాజకీయాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. రాజకీయ ప్రయాణంలో, టీవీకే నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.
విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందని ప్రసంశించారు. టీవీకే తొలి బహిరంగ సభను చాలాచక్కగా నిర్వహించారంటూ అభినందించారు. విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారన్న ఆయన.. అందుకు అభినందిస్తున్నానని చెప్పారు. అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో టీవీకే భారీ సభ నిర్వహించింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు.
ప్రసంగం వాడీవేడిగా సాగింది. బీజేపీ, డీఎంకే పార్టీలను తమ ప్రత్యర్థులుగా ప్రకటించారు. అలాగే, పలు పార్టీలకు స్నేహహస్తాన్ని అందించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు.