గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరై, రామ్ చరణ్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా నిర్మిస్తోన్న నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో..’గేమ్ చేంజర్’ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని దిల్ రాజు ఈ కార్యక్రమంలో వెల్లడించారు.
ఇంకా మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘మీ ఓపికకు పరీక్ష పెడుతున్నాం. ఇంకొంత కాలం ఓపిక పట్టాల్సిందే. ఒక తుపాను వచ్చే ముందు ప్రశాంతమైన వాతావరణం ఎలా ఉంటుందో.. అలా కాస్త సైలెంట్‌గా ఉండక తప్పదు. ఎందుకంటే, రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి.. ఆ స్థాయిని మించేలా ‘గేమ్ చేంజర్’ని శంకర్ తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత ఐదు నెలల్లో సినిమాను రిలీజ్‌కు తీసుకొస్తాం.
చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా ‘జరగండి జరగండి’ పాటని విడుదల చేశాం. ఈ సాంగ్‌లో చూసింది చాలా తక్కువ. అంతా దాచిపెట్టాం. థియేటర్లలో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డ్యాన్స్ చేస్తారు. ఇంకొన్ని నెలలు కాస్త నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘దిల్ మామా.. మాకొక అప్‌డేట్ ఇవ్వు’ అంటూ విూరు పెట్టే కామెంట్స్ అన్ని చూస్తూనే ఉన్నా. ఇకపై ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ అయినా.. శంకర్ ఇవ్వమంటే ఇస్తా తప్పితే ఎలాంటి లీకులు ఇవ్వలేను‘ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.