అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడాన్ని, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలవడాన్ని సీఎం హృదయ విదారకంగా అభివర్ణించారు. ఈ సంఘటనకు కారణమైన సెలబ్రిటీకి, థియేటర్ యాజమాన్యానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సంఘటనకు ముందు, థియేటర్‌లో ప్రత్యేక షోకు సెలబ్రిటీ హాజరవుతారని తెలిసిన పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతోపాటు, థియేటర్‌లోకి వెళ్లేందుకు, బయటకు రాకపోకలకు తగిన ఏర్పాట్లు లేవని సూచించారు. అయితే, హీరో మాత్రం పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్ షో చేస్తూ థియేటర్‌కు చేరుకున్నారని సీఎం వివరించారు. ఈ కారణంగా పక్కన ఉన్న థియేటర్ల నుంచి ప్రజలు ఒకేసారి సంధ్య థియేటర్ వైపు పరుగెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వివరించారు.
ఈ విషాదకర ఘటనలో తన కుమారుడి కోసం ఆ తల్లి చివరి క్షణాల్లో కూడా అతని చేయి పట్టుకుని ప్రాణాలు విడిచిందని, ఆమె బిడ్డ ఇప్పటికీ కోమాలో ఉన్నాడని సీఎం తెలియజేశారు. హీరో థియేటర్ లో ఉండటం వల్లనే తొక్కిసలాట జరిగింది. అప్పుడే శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. ఇక డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. ఆ తరువాత కూడా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. అందుకే హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు.
అయితే, బాధిత కుటుంబాన్ని ఒకసారి కూడా హీరో పరామర్శించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ఒక పరామర్శ చేయని వ్యక్తులు మానవత్వం అనే మాట మాట్లాడటానికి అర్హులా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసులు తమ విధిని నిర్వహించినందుకే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఓ పార్టీ నేతలు పోలీసులపై అనుచితమైన విమర్శలు చేయడం దారుణమని సీఎం అన్నారు. పోలీసులపై చేసిన విమర్శలను ఆయన ఖండిస్తూ, “చట్టం ముందు అందరూ సమానమే. సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు ప్రత్యేక చట్టాలు ఏమీ ఉండవు,” అని స్పష్టం చేశారు.
ఈ ఘటనలో బాధితులను పరామర్శించకుండా, జైలు నుంచి తిరిగొచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టడాన్ని సీఎం ఎద్దేవా చేశారు. “ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రీతిని మా ప్రభుత్వం ఉపేక్షించదు,” అని ఆయన అన్నారు. సంఘటనపై సీఎం చేసిన వ్యాఖ్యలు అందరిలో చర్చకు దారి తీస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులపై బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయకుండా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “ప్రాణాలు బలవుతుంటే తాము తట్టుకోబోమని,” సీఎం తేల్చిచెప్పారు.