పవన్ పర్యటన.. జేడీ లక్ష్మినారాయణ ఏమన్నారంటే..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో పర్యటించి బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యాచరణపై ఆయన చేసిన ఈ పర్యటనకు దేశ వ్యాప్తంగా స్పందన వస్తోంది. ఈ సందర్భంలో సీబీఐ మాజీ జేడీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న ఈ చొరవను ప్రశంసిస్తూ, ‘‘గిరిజనుల అభివృద్ధి కోసం మీ అంకితభావం నిజంగా ఆదర్శనీయమైంది. రాజ్యాంగంలోని 46, 244, 244ఏ, 275(1) అధికరణలు గిరిజనుల విద్య, భూహక్కులు, సంక్షేమానికి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను పొందుపరిచాయి. మీరు వీటిని అమలు చేయడంలో అగ్రగామిగా నిలుస్తారని ఆశిస్తున్నాను,’’ అంటూ ట్వీట్‌ ద్వారా వ్యాఖ్యానించారు.

గిరిజన సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు, గిరిజన ఉప ప్రణాళికలు, జిల్లా ఖనిజ లవణాల ఫౌండేషన్‌ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ సూచించారు. నిధుల వినియోగం అట్టడుగు స్థాయికి చేరేలా, గిరిజనులకు లభించే పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి, వారి సమస్యలను పరికించడం ప్రశంసనీయమని, ఆయన నాయకత్వంలో గిరిజన సంక్షేమం మరింతగా ముందుకు సాగుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ చర్యలు రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి కొత్త దిశగా మారతాయని ఆయన తెలిపారు.